TS HC on Margadarsi Chits : మార్గదర్శిలో తనిఖీలపై తెలంగాణ హైకోర్టు స్టే…..
TS HC on Margadarsi Chits చిట్‌ఫండ్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపై మార్గదర్శి చిట్స్‌లో నిర్వహిస్తున్న తనిఖీలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. మార్గదర‌్శి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టులో ఊరట లభించింది. మరోవైపు హైదరాబాద్‌లోని మార్గదర్శి సంస్థ ప్రధాన కార్యాలయంలో తనిఖీలకు వెళ్లిన అధికారులకు సంస్థ సిబ్బంది సహకరించకపోవడంతో నోటీసులు సంస్థ కార్యాలయంలో గోడలకు అతికించారు.
TS HC on Margadarsi Chits మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయంలో సోదాలకు విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన వారంట్‌ను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి సంస్థకు చెందిన చందా దారుల వివరాలను ఏపీ అధికారులు కోరారని, ఇది వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని, అందువల్ల సోదాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.
విజయవాడ జిల్లా సబ్‌రిజిస్ట్రార్ ఈ నెల 13న జారీ చేసిన వారంట్ ఆధారంగా ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు హైదరాబాద్‌లోని మార్గదర్శి కేంద్ర కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం జస్టిస్ ముమ్మనేని సుధీర్‌కుమార్ విచారణ చేపట్టారు. ఇరు పక్షాల వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
మార్గదర్శికి చెందిన చందాదారుల పేర్లు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లను ఏపీ అధికారులు అడగడంపై మార్గదర్శి న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఇది చందాదారుల వ్యక్తిగత సమాచారమే కాకుండా, మార్గదర్శికి చెందిన మేధోసంపత్తి ఆస్తి అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అధికారులు ప్రొసీడింగ్స్ జారీ చేసే ముందు ఒక చిట్, లేదా చిట్ గ్రూపులో ఏదైనా అక్రమం, చట్ట ఉల్లంఘనలున్నాయని పేర్కొనకపోవడాన్ని ప్రశ్నించారు.
మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే పరిధిపై న్యాయమూర్తి ప్రాథమికంగా సందేహం వ్యక్తం చేయడంతో, మార్గదర్శి తరఫు న్యాయవాది ఎం.వి.దుర్గాప్రసాద్ స్పందిస్తూ ఆర్టికల్ 226 క్లాజ్ 2 కింద తెలంగాణ హైకోర్టుకు విచారించే పరిధి ఉంటుందనడంతో అందుకు న్యాయమూర్తి అమోదం తెలిపారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30, 33, 40 కింద కోర్టు పరిధి లేదని, ఏపీ తరఫు న్యాయవాది పి.గోవింద్‌రెడ్డి అభ్యంతరం లేవనెత్తారు. ఆ సెక్షన్లు ఇక్కడ వర్తించవని న్యాయమూర్తి ప్రకటించారు. తెలంగాణ కోర్టు పరిధిలోని హైదరాబాద్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడానికి వారంట్ జారీ చేసినందున ఈ పిటిషన్ విచారణార్హమేనన్నారు.
మార్గదర్శి తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ మార్గదర్శి ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉన్నందున ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ సోదాలు నిర్వహించే అధికారం లేదని వాదించారు. ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున చిట్‌ఫండ్ చట్ట ప్రకారం తెలంగాణకే పరిధి ఉంటుందని, దాని శాఖలున్న ఏపీకి కాదన్నారు. ఆ రాష్ట్రాల్లో ఉన్న శాఖలపైనే వాటికి పరిధి ఉంటుందన్నారు.
ఏపీ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో 17 బ్రాంచీల్లో సోదాలు నిర్వహించారని, ఒక్క శాఖలో కూడా లోపాలున్నట్లు చెప్పలేదన్నారు. అయినప్పటికీ ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌లో లోపాలుంటాయన్న అనుమానంతో ఇక్కడికి వచ్చారన్నారు. కార్పొరేట్ కార్యాలయంపై ఆరోపణలుంటే విచారించే పరిధి తెలంగాణ ప్రభుత్వానికే ఉంటుందని పేర్కొన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌కు రూ.9,677 కోట్ల టర్నోవరుతో 108 బ్రాంచీల్లో 2.71 లక్షల మంది చందాదారులున్నారని, ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ, ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన అధికారుల తనిఖీలు శుక్రవారం ముగిశాయి. బుధవారం నుంచి మూడు రోజుల పాటు మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలు చేసిన ఏపీ అధికారులు వివిధ రికార్డులను తీసుకున్నారు. చిట్‌లకు సంబంధించిన వివరాలతో పాటు బ్యాంకు ఖాతాల సమాచారాన్ని తీసుకున్నారు. మార్గదర్శి సంస్థలో తనిఖీలకు సంబంధించి పంచనామాపై సంతకాలు చేయడానికి సంస్థ ప్రతినిధులు నిరాకరించడంతో వాటిని కార్యాలయంలో గోడలకు అతికించారు.