TSPSC Group 1 Exam Cancelled: బిగ్ బ్రేకింగ్.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు-telangana group 1 exam 2023 cancelled check full details are here ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana Group 1 Exam 2023 Cancelled Check Full Details Are Here

TSPSC Group 1 Exam Cancelled: బిగ్ బ్రేకింగ్.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రద్దు
తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష రద్దు

TS Group 1 Exam Updates: గ్రూప్ 1 పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్పీ. ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

telangana group 1 exam 2023 Cancelled:గ్రూప్ 1 పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. పేపర్ లీకేజ్ వ్యవహరంతో ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. అక్టోబర్ 16వ తేదీన 503 పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... 2.86 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో 1:50 నిష్పత్తిలో 25, 150 మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు.

ట్రెండింగ్ వార్తలు

గ్రూప్ 1 పరీక్షపై కీలక నిర్ణయం
గ్రూప్ 1 పరీక్షపై కీలక నిర్ణయం

జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జనవరి 22వ తేదీన జరిగిన ఏఈఈ, ఫిబ్రవరి 26వ తేదీన జరిగిన డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. మిగతా పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

TSPSC AE Exam 2023 Cancelled : ఇప్పటికే ఏఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. 837 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షను రద్దు చేసూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో పరీక్ష రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ నెల 5న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 74 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏఈ పోస్టులకు మరోసారి రాత పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పేపర్ లీక్… ఏం జరిగిందంటే..?

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రశ్నాపత్రాల కొనుగోలు కోసం తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులతో రేణుక సంప్రదింపులు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రేణుక తమ్ముడికి ఏఈ పరీక్షకు హాజరయ్యే అర్హత లేకపోయినా అతని పేరుతో ప్రశ్నాపత్రాల కోసం ప్రయత్నించినట్లు తేల్చారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వద్ద సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ నుంచి ప్రశ్నాపత్రాలు సేకరించి వాటిని విక్రయించేందుకు అభ్యర్థులతో బేరం కుదుర్చుకొని రూ.లక్షలు కాజేసేందుకు వ్యూహరచన చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. తన సోదరుడు రాజేశ్వర్‌ నాయక్‌కు ఏఈ ప్రశ్నపత్రాలు కావాలంటూ రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో రేణుక బేరం కుదుర్చుకుంది. టీటీసీ చదివిన రాజేశ్వర్‌ కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఏఈ పరీక్ష రాసేందుకు కావాల్సిన విద్యార్హత అతనికి లేదు. అయినా అతని కోసం ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్‌తో చెప్పింది. అదే సమయంలో ప్రశ్నపత్రాలు సమకూరుస్తానంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌ నాయక్‌లతో రేణుక రూ.14 లక్షలకు బేరం కుదుర్చుకుంది. వారి వద్ద డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. ఆ డబ్బును ప్రవీణ్‌ తన బ్యాంకు ఖాతాలో జమ చేశాడు.

రాజమండ్రిలో ఉన్న తన బాబాయికి ప్రవీణ్‌ రూ.3.5 లక్షలు ఆన్‌లైన్‌లో పంపినట్టు పోలీసులు గుర్తించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగి రాజశేఖర్‌కు ప్రవీణ్‌ డబ్బు ఆశ చూపించి ప్రశ్నపత్రాలను సంపాదించాడు. రేణుక ఇచ్చిన రూ.10 లక్షల్లో అతనికి కొంత ఇస్తానని చెప్పాడు. ఈలోపే పేపర్ లీక్ వ్యవహారం బయటపడటంతో రాజశేఖర్‌కు సొమ్ము అందలేదని పోలీసులు గుర్తించారు.

ఇక పేపర్‌ లీక్‌ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మన్సూర్‌తల్లి తండాకు చెందిన కె.శ్రీనివాస్‌ 2020లో పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఎస్సై ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. మెయిన్స్‌కు పరీక్షకు సిద్ధమవుతూ ఫిబ్రవరి 1 నుంచి సెలవులో ఉన్నాడు. ప్రశ్నపత్రాలు విక్రయిస్తానంటూ రేణుక ఫోన్‌ చేసినప్పుడు తనకు అవసరం లేదని చెప్పాడు. ఏఈ పరీక్షలకు సిద్ధమవుతున్న కొందరు అభ్యర్థుల సమాచారం సేకరించి ఆమెకు ఇచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్‌గా ఉంటూ ప్రశ్నాపత్రాల లీకేజీ సమాచారం తెలిసినా ఇవ్వకపోవడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా తీసుకున్నారు. శ్రీనివాస్ వ్యవహారంపై సీపీ కార్యాలయానికి నివేదిక పంపినట్టు మేడ్చల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఇక ఈ కేసులోని ప్రవీణ్ పెన్ డ్రైవ్ ను సీజ్ చేసిన పోలీసులు... ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించి విశ్లేషించారు. అయితే ఇందులో కేవలం ఏఈ పరీక్షా పత్రం కాకుండా... టౌన్‌ప్లానింగ్‌, వెటర్నరీ అసిస్టెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక కేవలం ప్రవీణ్ పెన్ డ్రైవ్ మాత్రమే కాకుండా... ఈ కేసులో అరెస్ట్ అయిన తొమ్మిది మంది నిందితుల ఫోన్లను కూడా పోలీసులు ఎఫ్ఎస్‌ఎల్‌ కి పంపించారు. మరోవైపు నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే... నిందితులు గత కొంతకాలంగా ప్రధానంగా ఎవరితో మాట్లాడారన్న విషయాలపై కూడా సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేస్తారని సమాచారం.

ఈ పరిణామల నేపథ్యంలో… గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షాపత్రాలు కూడా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆయా పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత కథనం