Cable Bridge in Khammam: ఖమ్మం వాసులకు గుడ్ న్యూస్..‘మున్నేరు’పై రూ. 180 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి -telangana govt sanctions funds for bridge across munneru stream in khammam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cable Bridge In Khammam: ఖమ్మం వాసులకు గుడ్ న్యూస్..‘మున్నేరు’పై రూ. 180 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి

Cable Bridge in Khammam: ఖమ్మం వాసులకు గుడ్ న్యూస్..‘మున్నేరు’పై రూ. 180 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి

HT Telugu Desk HT Telugu
Jan 20, 2023 12:41 PM IST

new cable-stayed bridgein khammam: ఖమ్మం జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ బహిరంగ సభ వేదికగా మున్నేరు బ్రిడ్జి విషయంలో సీఎం హామీగా... మరుసటి రోజే నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయి.

ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి
ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జి

Funds for bridge across Munneru stream in Khammam: ఖమ్మం పట్టణంలో సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో ఉన్న మున్నేరు వాగుపై ట్రాఫిక్‌ సమస్యలకు త్వరలోనే చెక్‌ పడనున్నది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ తొలి భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన మరుసటిరోజే నిధులు విడుదలయ్యాయి. మున్నేరు వాగుపై అత్యాధునిక పద్ధతిలో కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 420 మీటర్ల పొడవున ఈ కేబుల్ వంతెనను నిర్మించనున్నారు. ఈ కేబుల్‌ వంతెన 300 మీటర్లు కేబుల్‌పై నిలువనుండగా, మిగిలిన 120 మీటర్లు ఆర్‌సీసీతో నిర్మించనున్నారు.

ఖమ్మంలోని మున్నేరు వాగుపై దశాబ్దాల క్రితం బ్రిడ్జి నిర్మించారు. అయితే అది అతి తక్కువ వెడల్పుగల వంతెన కావటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వరంగల్‌ వైపునుంచి ఖమ్మం పట్టణానికి వచ్చే వాహనాలు కూడా ఈ వంతెన గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ఖమ్మం పట్టణం భారీగా విస్తరించడం, సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో వాహనాల రద్దీ పెరగడంతో ఈ వంతెనపై నిత్యం ట్రాఫిక్‌ జామ్‌ అవుతున్నది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మున్నేరు వాగుపై వంతెన నిర్మించాలని సీఎం కేసీఆర్‌కు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఖమ్మం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన తరహాలోనే ఖమ్మం మున్నేరు వాగుపై రూ.180 కోట్ల వ్యయంతో కేబుల్‌ బ్రిడ్జిని నిర్మించనున్నారు. త్వరలోనే వంతెన నిర్మాణానికి అవసరమైన డిజైన్లు రూపొందించి, టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.

వరాల జల్లు…

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రసంగించిన కేసీఆర్... జిల్లాపై వరాలజల్లు కురిపించారు. పెద్ద తాండా, కల్లూరు, ఏదులాపురం, కల్లాల, నేలకొండపల్లి మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు, సత్తుపల్లి, మధిర, వైరా మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు నెలరోజుల్లోపు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్‌. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. ఈ బాధ్యతను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్‌కు అప్పగించారు. ప్రభుత్వ స్థలం ఉన్నట్లయితే దానిని జర్నలిస్టులకు కేటాయించాలని, లేనట్లయితే ప్రైవేట్‌ స్థలాన్ని ల్యాండ్‌ అక్విజేషన్‌ చేసి స్థలాలు ఇవ్వాలని మంత్రులకు సూచించారు.

Whats_app_banner