Traffic Rules : హైదరాబాద్‌లో మారిన ట్రాఫిక్ రూల్స్... గీటు దాటితే జేబులు ఖాళీ
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షల్ని సవరించారు. మారిన నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. రోడ్ అబ్ స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్‌మెంట్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడిపే వారికి చెక్ పెట్టేందుకు పోలీసులు కఠిన ఆంక్షల్ని అమల్లోకి తీసుకువచ్చారు. రోప్ పేరిట కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను హైదరాబాద్‌లో అమలు చేస్తున్నారు. నేటి నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై భారీ జరినామాలు విధించనున్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్‌లైన్ దాటేసి ముందుకు వెళ్లే వాహనచోదకులకు ప్రస్తుతం రూ.200 ఫైన్ విధిస్తున్నారు. నేటి నుంచి జీబ్రా లైన్ క్రాస్ చేసే వారికి రూ.200 జరిమానా విధిస్తారు. ఫ్రీ లెఫ్ట్ వెళ్లకుండా వాహనాలను అడ్డుగా పెట్టే వారికి రూ.వెయ్యి రుపాయలు జరిమానా విధిస్తారు. రోడ్ల వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌లపై పాదచారులు నడవకుండా దుకాణాలు అక్రమిస్తే వారికి భారీ జరిమానాలతో పాటు వారిపై కేసులు కూడా నమోదు చేస్తారు.
ఇక వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్క్ చేస్తే రూ.600 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నియమాలు పక్కాగా అమలయ్యేలా హైదరాబాద్ సీపీ సివి.ఆనంద్ చర్యలు చేపట్టారు. నగరంలో కొత్తగా అమల్లోకి వచ్చిన రోప్ విధానాన్ని సీపీ స్వయంగా పరిశీలిస్తున్నారు.
మరో ముడు, నాలుగు రోజుల పాటు వాహనదారుల్లో అవగాహన కల్పిస్తామన్నారు. చలాన్లు వెంటనే విధించడం లేదని, మూడు రోజుల తర్వాత విధిస్తామని చెప్పారు. వాహనదారుల్లో పరివర్తన రావాలని, అన్ని సమస్యలు పరిష్కారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు.