TS Collectors SPs Transfer : కొరడా ఝళిపించిన ఈసీ- కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు-telangana election commission transfers collectors sps hyderabad cp cv anand transferred to khammam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Collectors Sps Transfer : కొరడా ఝళిపించిన ఈసీ- కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు

TS Collectors SPs Transfer : కొరడా ఝళిపించిన ఈసీ- కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు

Bandaru Satyaprasad HT Telugu
Oct 11, 2023 09:07 PM IST

TS Collectors SPs Transfer : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కేంద్రం ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. రాష్ట్రంలో కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు వేసింది.

కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు
కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు

TS Collectors SPs Transfer : తెలంగాణలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ వేటు వేసింది. నలుగురు కలెక్టర్లపై ఈసీ బదిలీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీచేసింది. 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్ల బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు ఇచ్చింది. రవాణాశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ను కూడా ఈసీ బదిలీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బదిలీ చేసింది. ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ల బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

yearly horoscope entry point

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ బదిలీ

హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సీపీ రంగనాథ్‌, నిజామాబాద్‌ సీపీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్ ముషారఫ్‌ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్‌ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. గురువారం సాయంత్రం 5 గంటల కల్లా కొత్త ప్యానల్‌ పంపాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పలువురు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలపై ఈసీ బదిలీ వేటు వేసింది.

ఐదు రాష్ట్రాల్లో బదిలీలు

కేంద్ర ఎన్నికల సంఘం... ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో అధికారులను బదిలీ చేసింది. 9 మంది జిల్లా మేజిస్ట్రేట్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలపై బదిలీ వేటు చేసింది. ఎస్పీలు, 4 కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు పనిలో అలసత్వం చూపుతున్నారని వారిని బదిలీ చేసింది. బదిలీ అయిన వారంతా తక్షణమే జూనియర్‌లకు ఛార్జ్‌ను అప్పగించాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు ప్యానెల్‌ను పంపమని రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదేశించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలకు నవంబర్ 7 నుంచి 30 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో తన సమీక్షా సమావేశాల సందర్భంగా అధికారుల అలసత్వం గమనించామని, అందుకే బదిలీలు చేపట్టినట్లు ఈసీ పేర్కొంది.

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ

అదేవిధంగా తెలంగాణలో జరిగిన సమీక్షా సమావేశంలో.. అనేక మంది నాన్-క్యాడర్ అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారని, పరిపాలనా, పోలీసు సేవలకు చెందిన అధికారులకు తక్కువ ప్రాధాన్యతగల పోస్టింగ్‌లు ఇచ్చారని ఎన్నికల కమిషన్ గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ పోలీసు అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. పనితీరు, సంబంధిత ఇన్‌పుట్‌లను అంచనా వేసిన తర్వాత తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసినట్లు ఈసీ తెలిపింది.

Whats_app_banner