Telangana CS : నా 34 ఏళ్ల సర్వీసులో ఇంత ప్రగతి చూడలేదు-telangana cs santhakumari comments about development of telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Cs : నా 34 ఏళ్ల సర్వీసులో ఇంత ప్రగతి చూడలేదు

Telangana CS : నా 34 ఏళ్ల సర్వీసులో ఇంత ప్రగతి చూడలేదు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 11, 2023 09:27 AM IST

Telangana Decade Celebrations 2023: అన్ని రంగాల్లో రికార్డు స్థాయిలో తెలంగాణ పురోగతి సాధించిందన్నారు సీఎస్ శాంతికుమారి. అభివృద్ధికి తెలంగాణ ఐకాన్‌గా మారిందని వ్యాఖ్యానించారు.

సీఎస్ శాంతికుమారి
సీఎస్ శాంతికుమారి

TS CS Santha Kumari Latest News: దేశంలో మరే రాష్ట్రం సాధించని రీతిగా తెలంగాణ అభివృద్ధి చెందిందని అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. తెలంగాణ రాష్ట్రం అవతరణ తొమ్మిదేళ్ల పూర్తి కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఎంతో ప్రగతి సాధించిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం తెలంగాణా సుపరిపాలన దినోత్సవంగా పాటించారు. ఈ సందర్బంగా ఎంసీఆర్ హెచ్చార్దీ లో ఏర్పాటు చేసిన సుపరిపాలన దినోత్సవ కార్యక్రమానికి సీఎస్ హాజరయ్యారు. డీజీపీ అంజనీ కుమార్, ప్రిన్సిపల్ సిసీఎఫ్ దొబ్రీయల్ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ ఓడీ లు, పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.... నీటి పారుదల, వ్యవసాయం, ఐటి, పరిశ్రమలు, విద్యా, ఆరోగ్యం, సంక్షేమం, సుపరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఆయా రంగాల్లో రికార్డు స్థాయిలో పురోగతి ఉందని వివరించారు. 2014 కు ముందు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఉండేదాని.... వాటర్ ట్యాంక్ లకు కూడా పెద్ద ఎత్తున పైరవీలు చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. గతంలో వేసవి కాలం వచ్చిందంటే జిల్లా కలెక్టర్లతో సహా ప్రభుత్వం సమ్మర్ యాక్షన్ ప్లాన్ లు రూపొందించే విధానం ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని అన్నారు.

ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని, దీనికి ప్రధానకారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలేనని స్పష్టం చేశారు. తెలంగాణా రాష్ట్రంలో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక గొప్ప కార్యక్రమమని, హరితహారంలో నాటిన మొక్కల్లో దాదాపు 90 శాతం మొక్కలు మనుగడ సాధించడం ఒక అద్భుతం అని అన్నారు. రాష్ట్రంలో ప్రసూతి మరణాలలో గణనీయమైన తగ్గుదల సాధించామని, ఇమ్మ్యూనైజషన్ పెరిగిందని, వైద్య ఆరోగ్య రంగంలో అద్భుతాలు చవిచూశామని చెప్పుకొచ్చారు. తన 34 ఏళ్ల సర్వీసులో తెలంగాణా రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్నా అభివృద్ధి గతంలో చూడలేదని వ్యాఖ్యానించారు. దీనికి కారణం... ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి అంకిత భావంతో పనిచేయడమేనని అన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు తమ తమ శాఖలు సాధించిన విజయాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు.

Whats_app_banner