TS New Secretariat: కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు.. సీఎం కేసీఆర్ నిర్ణయం-telangana cm kcr key decision to name of the new secretariat after ambedkar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts New Secretariat: కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

TS New Secretariat: కొత్త సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Sep 15, 2022 04:05 PM IST

రాష్ట్ర నూతన సచివాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేశారు.

<p>సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)</p>
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో) (TWITTER)

cm kcr decision on new secretariat name: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.... ‘‘ తెలంగాణ రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు, మహామేధావి డా. బిఆర్ .అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం. ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నది' అని అన్నారు.

స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా. బిఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందని గుర్తు చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తుందని చెప్పారు.

'అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. సమాఖ్య స్పూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్పూర్తి మమ్మల్ని నడిపిస్తుంది. భారతదేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత. ఆనాడే నిజ భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు.

'భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా డా. అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదు. భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, భారత సామాజిక తాత్వికుడు రాజ్యాంగ నిర్మాత పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాం. అందుకు సంబంధించిన తీర్మానాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది కూడా. ఇదే విషయమై నేను భారత ప్రధానికి త్వరలో స్వయంగా లెటర్ కూడా రాసి పంపుతాను. తెలంగాణ ప్రభుత్వం డిమాండును పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంట్ భవనానికి డా. బిఆర్. అంబేద్కర్ పేరును పెట్టాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను' అని వెల్లడించారు.

Whats_app_banner