Telangana BJP : ఓవైపు లిక్కర్ స్కాం అరెస్టులు.. మరోవైపు టీ బీజేపీ నేతలతో షా భేటీ.. ఏం జరగబోతోంది ? -telangana bjp leaders to meet amit shah in delhi to discuss on various issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Bjp : ఓవైపు లిక్కర్ స్కాం అరెస్టులు.. మరోవైపు టీ బీజేపీ నేతలతో షా భేటీ.. ఏం జరగబోతోంది ?

Telangana BJP : ఓవైపు లిక్కర్ స్కాం అరెస్టులు.. మరోవైపు టీ బీజేపీ నేతలతో షా భేటీ.. ఏం జరగబోతోంది ?

HT Telugu Desk HT Telugu
Feb 27, 2023 03:25 PM IST

Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ వెళ్లనున్న రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు... కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాను అరెస్టు చేయడం... త్వరలో మరిన్ని అరెస్టులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. అమిత్ షాతో టీ బీజేపీ నేతల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో త్వరలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అవుతారని... బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీపై ఆసక్తి
తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీపై ఆసక్తి

Telangana BJP : ఢిల్లీ మద్యం కుంభకోణం.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లిక్కర్ కేసుకి సంబంధించి చోటుచేసుకుంటున్న పరిణామాలు.. తెలంగాణ పాలిటిక్స్ లోనూ కలకలం రేపేలా కనిపిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఆదివారం (ఫిబ్రవరి 26న) విచారణకు పిలిచిన సీబీఐ.. ఇన్వెస్టిగేషన్ తర్వాత అరెస్టు చేసింది. దీంతో.. లిక్కర్ స్కాంలో భాగస్వాములైన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదే కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్ చంద్రారెడ్డి.. మాగుంట రాఘవ అరెస్టయి జైల్లో ఉన్నారు. ఈడీ చార్జ్ షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్లు కూడా ప్రస్తావించడంతో... తర్వాతి టార్గెట్ ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును ఇదే కేసులో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇలా.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ దూకుడు ప్రదర్శిస్తున్న క్రమంలో.. బీజేపీ రాష్ట్ర నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫిబ్రవరి 28న ఢిల్లీకి రావాల్సిందిగా కీలక నేతలకు ఆర్డర్స్ జారీ అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు లిక్కర్ స్కాం అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర కూడా స్కాంలో ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర నేతలతో అమిత్ షా ఏ అంశాలపై చర్చిస్తారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

మరోవైపు.. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఐక్యత లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కీలక నేతల మధ్య కమ్యూనికేషన్ అంతగా లేదనే ప్రచారం జరుగుతోంది. దీనివల్లే... బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ అనుకున్న స్థాయిలో సాగడం లేదని... చేరికలు ఆశించిన స్థాయిలో జరగడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే అధిష్టానానికి చేరాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్న అమిత్ షా... రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

త్వరలో కవిత అరెస్ట్ : వివేక్ వెంకటస్వామి

ఢిల్లీ మద్యం స్కాం కేసులో త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతారంటూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ కు బీఆర్ఎస్ సహాయం చేసిందని.. ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేతలకి రూ. 150 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తరహాలోనే అతి త్వరలో కవిత కూడా జైలుకి వెళతారని అన్నారు. తిరుమలలో సోమవారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో వివేక్ మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో మద్యంపై భారీగా ఆర్జిస్తున్నారని.. ఇదే తరహాలో ఢిల్లీలో దండుకోవాలని అనుకున్నారని విమర్శించారు. ఈ కేసులో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందిని అరెస్టు చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో దోచుకున్న అవినీతి డబ్బులతోనే బీఆర్ఎస్ పేరుతో దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. ఆయా రాష్ట్రాల్లో ఉనికిలో లేని నేతలే బీఆర్ఎస్ లో చేరుతున్నారని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point