Breast Cancer : బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ - సెప్టెంబర్ 29న 'పింక్ ఫర్ రన్', వరల్డ్ రికార్డుపై గురి..!-sudha reddy foundation and meil to conduct pink power run 2024 on 29th september 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Breast Cancer : బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ - సెప్టెంబర్ 29న 'పింక్ ఫర్ రన్', వరల్డ్ రికార్డుపై గురి..!

Breast Cancer : బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ - సెప్టెంబర్ 29న 'పింక్ ఫర్ రన్', వరల్డ్ రికార్డుపై గురి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 05, 2024 06:29 PM IST

బ్రేస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా పింక్ ఫర్ రన్ - 2024ను తలపెట్టారు. MEIL మరియు సుధారెడ్డి ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని చేపట్టనున్నారు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగే ఈ భారీ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ - సెప్టెంబర్ 29న 'పింక్ పవర్ రన్'
బ్రెస్ట్ క్యాన్సర్ నిర్మూలనపై అవగాహన ర్యాలీ - సెప్టెంబర్ 29న 'పింక్ పవర్ రన్'

సామాజిక సేవతో పాటు సహకారం అందించటంలో ముందుండే సుధారెడ్డి ఫౌండేషన్, ఎం.ఇ.ఐ.ఎల్(MEIL) ఫౌండేషన్ మరో అడుగు ముందుకేశాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని తలపెట్టాయి. ‘పింక్ పవర్ రన్ 2024’ పేరుతో సెప్టెంబర్ 29వ తేదీన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో ప్రతి ఒక్కరూ మమేకం కావాలని... క్యాన్సర్ పై చేసే పోరాటంలో ఐక్యతను ప్రదర్శించాలని రెండు ఫౌండేషన్లు కోరాయి.

పింక్ పవర్ రన్ - 2024…

'పింక్ పవర్ రన్ - 2024' ‌లో భాగంగా వయస్సుతో పాటు విభిన్నమైన వ్యక్తులను ఏకతాటిపైకి తీసుకురానున్నారు. ఈ గొప్ప సంకల్పంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయటమే లక్ష్యంగా మూడు రకాల మారథాన్ లను రూపొందించారు. 3 కిమీ, 5 కిమీలతో పాటు 10 కి.మీ రేసు ఉంటాయి. ఈ పింక్ మారథాన్ లో పాల్గొనే ఔత్సాహికులకు ప్రత్యేక రేస్ కిట్లు, పోషకాహారం అందజేస్తారు. అంతే కాకుండా రేస్ కు ముందు, తర్వాత చేయాల్సిన వ్యాయామ చిట్కాలను కూడా చెబుతారు. రేస్ ను పూర్తి చేసిన మెడల్స్ అందజేస్తారు.

గిన్నిస్ రికార్డుపై గురి..!

ఈ కార్యక్రమంలో వేలాది మందిని భాగస్వామ్యం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. పిల్లల నుంచి నుండి పెద్దల వరకు ఉండేలా చూడనున్నారు. గులాబీ రంగు దుస్తులను ధరించి... పక్షి రూపంలో భారీ మానవహారాన్ని ప్రదర్శించనున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ పక్షిరూప మానవహారం... ఐక్యతా, ఆశ, బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాడే విషయంలో నిబద్ధతకు సంకేతమని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

రేస్ మాత్రమే కాదు… ఐక్యతకు నిదర్శనం - సుధారెడ్డి

బ్రెస్ట్ కేన్సర్ పై పోరాటంలో కీలక పాత్ర వహిస్తున్న సుధారెడ్డి(UNICEF అంతర్జాతీయ మండలిలో సభ్యురాలు) మాట్లాడుతూ...పింక్ పవర్ రన్ ఒక రేస్ మాత్రమే కాదన్నారు. క్యానర్స్ ను జయించిన వారి ప్రేరణాత్మక విషయాలను పంచుకోవడానికి ఓ వేదికగా ఉంటుందన్నారు.

" పింక్ పవర్ రన్ ఒక రేస్ మాత్రమే కాదు. క్యాన్సర్ ని జయించిన వారి ప్రేరణాత్మక విషయాలను పంచుకోవడానికి, ఇతరులను ప్రేరేపించడానికి ఒక వేదిక. మనమందరం ఐక్యంగా ఉంటే, మానసిక అడ్డంకులను బద్దలు కొట్టగలం. సమాజంలో అపోహలను తొలగించగలం. వ్యక్తులకు వారి ఆరోగ్యాన్ని స్వయంగా చూసుకునే శక్తిని అందించగలం" అని సుధారెడ్డి అన్నారు.

"గిన్నీస్ వరల్డ్ రికార్డు ప్రయత్నంలో భాగంగా పక్షి రూపాన్ని ఎంచుకోవడం వెనుక లోతైన అర్థం ఉంది. సాధారణంగా పక్షి రెక్కలు... స్వేచ్ఛ మరియు ఎగరడానికి ప్రతీకగా భావిస్తారు. అదే స్వేచ్ఛ బ్రెస్ట్ కేన్సర్ జయించిన వారి పట్టుదల మరియు బలాన్ని సూచిస్తుంది. పింక్ పవర్ రన్ లాంటి కార్యక్రమంతో ఆత్మ న్యూనత భావం అనే సంకెళ్ళను తొలగించుకుని అచంచలమైన విశ్వాసం అనే స్వేచ్ఛ వైపు పరుగులు పెట్టే మానవీయ ఘట్టంగా నిలుస్తుంది" అని సుధారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం…

ఎం.ఇ.ఐ.ఎల్ సేవా కార్యక్రమాలను సుధారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. "ఎం.ఇ.ఐ.ఎల్ అంటే కార్పొరేట్ సంస్థనే కాదు. ఎప్పుడు ఆపద వచ్చిన మేము ఉన్నామని ముందుకువచ్చే స్వచ్చంద సేవలకు కూడా మారు పేరుగా మారింది. నిన్నటి వరదలు కావొచ్చు, మొన్నటి కరోనా కావొచ్చు. భవిష్యత్తులో ఏ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన మా రెండు సంస్థలు ముందుండి సేవలు చేస్తాం. మా రెండు ఫౌండేషన్లు మహిళ సాధికారతతో పాటు గ్రామీణ మహిళాభివృద్ధికి చేయూత అందచేస్తాం. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మొదలుపెడుతాం" అని సుధా రెడ్డి చెప్పుకొచ్చారు.

మెడల్స్ ను ఆవిష్కరించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధు
మెడల్స్ ను ఆవిష్కరించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు

ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వండి - పీవీ సింధు పిలుపు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి సింధు మాట్లాడుతూ... " సుధారెడ్డి గారి సామాజిక సేవలు ఎనలేనివి. సమాజంలో విస్తృతంగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించాలి. పింక్ పవర్ మారథాన్ లాంటి కార్యక్రమాలు అవగాహన కల్పించడమే కాకుండా క్యాన్సర్ భారిన పడినవారికి ఒక భరోసాని కల్పిస్తుంది. నేను కూడా ఈ మారథాన్ లో పాల్గొంటాను. ప్రజలందరూ కూడా భాగస్వామ్యం కావాలి" అని పిలుపునిచ్చారు.

ఎంతో అభినందనీయం - సుధా సిన్హా, ప్రముఖ అంకాలజీ కన్సల్టెంట్

ప్రముఖ మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్సు సుధా సిన్హా మాట్లాడుతూ... " దేశంలో ప్రతి 22 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. ముఖ్యంగా 40-50 సంవత్సరాల యుక్త మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్ననారు. దీనికి భయపడాల్సిన అవసరమే లేదు. అథ్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నవి. సుధారెడ్డి గారు నిర్వహిస్తున్న పింక్ మారథాన్ కార్యక్రమం క్యాన్సర్ పై అవగాహన పెంచడమే కాకుండా అపోహలు తొలగిస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం" అని చెప్పారు.

ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ ని జయించిన మహిళలు వెంకట రమణమ్మ ( ఖమ్మం ), శివ లక్ష్మి (నల్గొండ ) మాట్లాడారు. "మొదట్లో మాకు చాలా భయంగా ఉండేది. కానీ చికిత్స చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆరోగ్యం బాగా ఉంది. మా జీవిత అనుభవాలు ఇతరులకు పంచుకోవడానికి సుధారెడ్డి గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో గొప్పది. మా లాంటి వారి గురించి... క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్న సుధా రెడ్డి గారికి మా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఈ కార్యక్రమం లో రిజిస్టర్ కావటంతో పాటు మరింత సమాచారం కోసం www.pinkpowerrun.in వెబ్ సైట్ ని సందర్శించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

సుధారెడ్డి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యాపార రంగంలో తనదైన ముద్రవేస్తున్న ప్రతిభాశాలిగా గుర్తింపు పొందారు. ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సుధా రెడ్డి ఫౌండేషన్, UNICEF, గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్, బ్రెస్ట్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఫైట్ హంగర్ ఫౌండేషన్ మరియు యాక్షన్ అగైన్‌స్ట హంగర్ లాంటి స్వచ్చంద సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలకు ఆమె విశేషంగా కృషి చేస్తున్నారు.