Hyd Street Dogs: ఏడాది వయసున్న బాలుడిని చంపేసిన వీధి కుక్కలు
Hyd Street Dogs: వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. శంషాబాద్ ప్రాంతంలో అర్థరాత్రి తల్లి కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేశాయి.
Hyd Street Dogs: హైదరాబాద్‌లో మరో చిన్నారి వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. పాల కోసం తల్లిని వెదుక్కుంటూ రోడ్డుపైకి రావడమే ఆ చిన్నారి పాలిట శాపంగా మారింది.
తల్లి కాన్పు కోసం ఆస్పత్రిలో ఉండటంతో తండ్రితో కలిసి ఉంటున్న బాాలుడికి అర్థాంతరంగా ఆయుష్షు తీరిపోయింది. తండ్రి పక్కన నిద్రిస్తూ అర్థరాత్రి పాలకోసం లేచి తల్లిని వెదుకుతూ రోడ్డుపైకి వచ్చి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన శంషాబాద్‌లో జరిగింది.
శంషాబాద్‌లో వీధి కుక్కల దాడిలో ఏడాది వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారిని పీక్కుతింటున్న శునకాలను వాహన చోదకులు గమనించి వాటిని బెదిరించడంతో పారిపోయాయి.
ఆ మార్గంలో వెళుతున్న వారు చిన్నారిని పరిశీలించగా అప్పటికే మృత్యువాత పడ్డాడు. ఈ హృదయ విదారక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీసుల వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారానికి చెందిన కోళ్ల సూర్యకుమార్-యాదమ్మ దంపతులు ఉపాధి కోసం ఎనిమిదేళ్ల క్రితం శంషాబాద్‌కు వలస వచ్చారు.
రాళ్లగూడ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి రాజీవ్ గృహకల్ప ఇళ్ల కాంప్లెక్స్ సమీపంలో గుడిసె నిర్మించుకుని దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఓ కుమారుడు నాగరాజు(1) ఉన్నాడు. భార్యాభర్తలు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సూర్యకుమార్ భార్య యాదమ్మ నిండు గర్భిణి కావడంతో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది.
బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఏడవడంతో తండ్రి నాగరాజు బాలుడికి పాలు తాగించి నిద్ర పోయాడు. తెల్లవారుజామున బాలుడు మరోసారి లేచి తల్లి కోసం వెదుక్కుంటూ తాము ఉంటున్న గుడిసె నుంచి బయటకు వచ్చాడు. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉన్న వీధి కుక్కలు బాలుడిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
బాలుడిని కుక్కలు పీక్కుతినడం అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుక్కలను తరిమేసరికి చిన్నారి మృతి చెందాడు. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడం అక్కడ ఉన్న సీసీ టీవీల్లో రికార్డైంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.