Delhi Stray Dogs Attack: ఘోరం: రెండు రోజుల వ్యవధిలో.. అన్నదమ్ములను చంపేసిన వీధి కుక్కలు
Delhi Stray Dogs Attack: వీధి కుక్కల దాడిలో రెండు రోజుల వ్యవధిలో అన్నదమ్ములు చనిపోయారు. ఢిల్లీలో ఈ విషాదకర ఘటన జరిగింది.
Delhi Stray Dogs Attack: ఢిల్లీలోని వసంత్ కుంజ్ (Vasant Kunj) ప్రాంతంలో ఘోరం జరిగింది. వీధి కుక్కలు.. అన్నదమ్ములిద్దరనీ బలిగొన్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై దాడి చేసి చంపేశాయి. ఆనంద్ (7), ఆదిత్య (5) అనే చిన్నారులు వీధి కుక్కల దాడిలో మృతి చెందారు. ముందు అన్నను బలిగొన్న వీధి శునకాలు.. రెండు రోజుల తర్వాత తమ్ముడిపైనా దాడి చేశాయి. వివరాలివే..
ఇదీ జరిగింది
Delhi Stray Dogs Attack: ఢిల్లీలోని వసంత్ కుంజ్ అటవీ ప్రాంతం సమీపంలో సింధి క్యాంపులో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఈ నెల 10వ తేదీన ఆనంద్ ఆడుకుంటూ సమీపంలోని అడవిలోకి వెళ్లాడు. ఆ సమయంలో కుక్కలు అతడిపై దాడి చేశాయి. “మార్చి 10వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఓ ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదనే ఫిర్యాదును అందుకున్నాం. ఆ తర్వాత గాలింపు చేపట్టగా అడవిలో ఆనంద్ మృతదేహాన్ని గుర్తించాం. అతడి శరీరంపై జంతువులు చేసిన గాయాలు ఉన్నాయి. అడవిలోని కుక్కలే ఈ దాడి చేశాయి” అని ఓ పోలీసు అధికారి చెప్పారు.
రెండు రోజుల తర్వాత..
Delhi Stray Dogs Attack: రెండు రోజుల అనంతరం పోలీసులకు మరో మిస్సింగ్ కేసు వచ్చింది. మళ్లీ అడవిలో గాలింపు చేపట్టారు. ఆ సమయంలో ఆనంద్ తమ్ముడు ఆదిత్య మృతదేహం దొరికింది. తన బంధువు చందన్‍తో కలిసి కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆదిత్య అడవిలోకి వెళ్లాడని, ఆ సమయంలో కుక్కలు దాడి చేశాయని పోలీసులు వెల్లడించారు. చందన్ కాస్త దూరంలో ఉండగా.. వీధి కుక్కల మధ్య ఆదిత్య చిక్కుకుపోయాడని వెల్లడించారు. ఆ సమయంలో అతడిని చుట్టుముట్టిన వీధి కుక్కలు దాడి చేశాయని వెల్లడించారు.
“ఆదిత్యకు చందన్ కాస్త దూరంలో ఉన్నాడు. కొంతసేపటి తర్వాత అతడు తిరిగివచ్చాక చూడగా.. ఆదిత్య గాయాలతో పడి ఉన్నాడు. ఆ సమయంలో కుక్కలు ఇంకా చుట్టుముట్టే ఉన్నాయి” అని పోలీసులు వెల్లడించారు. ఆదిత్యను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని, అతడు మృతి చెందాడని పేర్కొన్నారు.
సూరత్‍లోనూ గత నెల ఇలాంటి ఘటనే జరిగింది. వీధి కుక్కల దాడిలో ఓ రెండేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి శరీరంపై సుమారు 60 గాయాలు అయ్యాయి. తీవ్రగాయాల పాలైన ఆ చిన్నారి చికిత్స పొందుతూ కన్నుమూసింది. సూరత్‍లోని బ్రౌజ్ ప్రాజెక్ట్ సైట్ వద్ద ఈ ఘటన జరిగింది.
గత నెల 21న హైదరాబాద్‍లో నాలుగేళ్ల పిల్లాడిని వీధి కుక్కలు చంపేశాయి. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. శునకాల దాడిలో ప్రదీప్ అనే ఆ చిన్నారి మృతి చెందాడు.
సంబంధిత కథనం