Delhi Liquor Scam : అభిషేక్‌ రావు తర్వాత సిబిఐ టార్గెట్‌ ఎవరు…?-speculations over delhi liquor scam arrests ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Delhi Liquor Scam : అభిషేక్‌ రావు తర్వాత సిబిఐ టార్గెట్‌ ఎవరు…?

Delhi Liquor Scam : అభిషేక్‌ రావు తర్వాత సిబిఐ టార్గెట్‌ ఎవరు…?

B.S.Chandra HT Telugu
Oct 10, 2022 12:31 PM IST

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బోయినపల్లి అభిషేక్‌ రావును అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. అభిషేక్‌ రావు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత సమీప బంధువుగా ప్రచారం జరుగుతోంది. అభిషేక్‌ రావును అరెస్ట్‌ చేసి ఢిల్లీ తరలించడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చుట్టూ కూడా ఈడీ, సీబీఐల నిఘా ఉన్నట్టు అవగతమవుతోంది.

<p>లిక్కర్ స్కామ్‌పై ఈడీ, సీబీఐ దర్యాప్తు</p>
లిక్కర్ స్కామ్‌పై ఈడీ, సీబీఐ దర్యాప్తు (HT_PRINT)

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం Delhi liquor Scam వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సన్నిహితుడు అభిషేక్‌ రావును సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇద్దరిని సిబిఐ అరెస్ట్‌ చేసింది. సమీర్‌ మహీంద్రు, విజయ్‌ నాయర్‌లను ఇప్పటికే అరెస్ట్ చేసిన సిబిఐ తాజాగా అభిషేక్‌ రావును అరెస్ట్‌ చేసింది.

yearly horoscope entry point

ఢిల్లీలో లిక్కర్ టెండర్లు దక్కించుకునేందుకు ఈ ముఠా నగదు లావాదేవీలు జరిపినట్లు సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. ఇండో స్పిరిట్స్‌ డైరెక్టర్‌ గా ఉన్న సమీర్‌ మహీంద్రుతో కలిసి రామచంద్ర పిళ్లై ఒప్పందాలు చేసుకున్నారని సిబిఐ ఇప్పటికే ప్రకటించింది. తాజా అరెస్ట్‌తో త్వరలో మరిన్ని అరెస్టులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. రాబిన్‌ డిస్టిలరీస్‌కు డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్‌ రావు ద్వారా ఢిల్లీ లిక్కర్‌ టెండర్లలో కల్వకుంట్ల కవిత జోక్యం చేసుకున్నారని బీజేపీ ఆరోపించింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ ఖరారు చేసే విషయంలో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఏ5గా ఉన్న విజయ్‌ నాయర్‌, సమీర్‌ మహీంద్రుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అభిషేక్‌ రావును సిబిఐ అరెస్ట్‌ చేసింది.

మరోవైపు టిఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నమనేని శ్రీనివాసరావు ఏడు కంపెనీల నుంచి ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ముడుపులు చెల్లించినట్లు సిబిఐ గుర్తించింది. ఈ వ్యవహారంపై దాదాపు నెలరోజులకు పైగా దర్యాప్తు జరుపుతున్న సిబిఐ సరిగ్గా మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసే సమయంలో కవిత సన్నిహితుడిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది.

కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న కవిత తిరుపతి వెళ్లిన సమయంలో ఆమెతో పాటు రామచంద్ర పిళ్లై, అభిషేక్ రావులు తిరుమల వెళ్లారు. ఆ సమయంలో కవితకు ప్రత్యేక విమానాన్ని అభిషేక్ రావు సమకూర్చినట్లు సిబిఐ ఆరోపిస్తోంది. దాదాపు తొమ్మిది సంస్థల్లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్‌, పంజాబ్ ఎన్నికల్లో ఢిల్లీ నేతలకు రూ.200కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని సిబిఐ ఆరోపిస్తుంది. అదే సమయంలో కవిత ఢిల్లీ వెళ్లేందుకు ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ను అభిషేక్ బుక్ చేసినట్లు బీజేపీ ఆరోపించింది. పంజాబ్‌ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు అవసరమైన డబ్బును లిక్కర్ పాలసీ ద్వారా సమీకరించినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.

రాబిన్‌ డిస్టిలరీస్‌లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్‌రావును సిబిఐ అరెస్ట్‌ చేయడంతో తర్వాతి అరెస్ట్‌ ఎవరిదనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత పేరు ఉందంటూ రెండు నెలల క్రితం బీజేపీ నేతలు ఆరోపించారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ ఆరోపణల్ని కవిత ఖండించారు. తాజాగా అనూస్‌ బ్యూటీ కేర్‌ సహా 9 కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేసింది.

సమీర్ మహేంద్రు, రామచంద్ర పిళ్లై కలిసి 2.3 కోట్ల ముడుపుల్ని ఢిల్లీలోని రాజకీయ పార్టీ నాయకుడికి అందచేసినట్లు ఆధారాలను సిబిఐ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన వారిని అరెస్ట్ చేస్తున్న సీబీఐ తదుపరి టార్గెట్‌ కవిత అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. లిక్కర్‌ స్కాంలో వినిపిస్తున్న కంపెనీలన్ని అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల బంధువులవిగా చెబుతున్నారు.

Whats_app_banner