IAS Uma Harathi : IAS అధికారి హోదాలో కుమార్తె... ఎస్పీ ర్యాంక్ హోదాలో తండ్రి సెల్యూట్ - పోలీస్ అకాడమీలో అపురూప దృశ్యం
Father Salutes IAS Daughter : హైదరాబాద్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో అపురూప దృశ్యం చోటు చేసుకుంది. ట్రైనీ ఐఏఎస్ హోదాలో అకాడమీని సందర్శించిన కుమార్తెకు… ఎస్పీ ర్యాంక్ హోదాలో పని చేస్తున్న తండ్రి సెల్యూట్ చేసి ఆహ్వానించారు. నెట్టింట ఇందుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
IAS Uma Harathi : తండ్రి పోలీస్ అధికారి…! ప్రస్తుతం ఎస్పీ ర్యాంక్ కేడర్ లో పని చేస్తున్నారు..! మరోవైపు కుమార్తె సివిల్స్ లో ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు ఎంపికైంది. ప్రస్తుతం శిక్షణలో ఉంది. కట్ చేస్తే…. తన శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్ హోదాలో… తండ్రి పోలీస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చోటును సందర్శించారు. ఇంకేముంది… వచ్చిన ఐఏఎస్ అధికారికి అక్కడ విధులు నిర్వర్తిస్తున్న తండ్రి సెల్యూట్ చేశాడు. పూల బోకే ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ అపురూప క్షణాలకు తెలంగాణ పోలీస్ అకాడమీ వేదికైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలెంటో ఇక్కడ చూడండి….
సివిల్స్ 3వ ర్యాంకర్….
ఉమాహారతి…సివిల్స్ ర్యాంకర్. 2022 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నూకల ఉమాహారతి సత్తా చాటిన సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఏకంగా ఆలిండియా లెవల్‌లో 3వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పోలీస్ ఉన్నతాధికారిగా(ఎస్పీ ర్యాంక్) పని చేస్తున్నారు.
శిక్షణలో భాగంగా ఉమా హారతితో పాటు మరికొంత మందితో కూడిన ఐఏఎస్ అధికారుల బృందం శనివారం హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ పోలీస్ అకాడమీని సందర్శించింది. ఇదే అకాడమీకి ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. అక్కడికి వచ్చిన ట్రైనీ ఐఏఎస్ ల బృందానికి పోలీస్ అకాడమీ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్ట్ స్వాగతం పలికారు. ఇందులో భాగంగా కుమార్తె ఉమా హారతికి తండ్రి వెంకటేశ్వర్లు సెల్యూట్ చేశారు. పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
ఈ అపురూప క్షణాలను చూసి అక్కడ ఉన్నవారంతా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తండ్రికి ఇంతకుమించిన సంతోషం ఏం కావాలని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే… అపురూప దృశ్యం అని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. వీరి ఫొటోలను చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఉమాహారతి ఐదో ప్రయత్నంలో సివిల్స్ సాధించారు. 2017 నుంచి ప్రిపేర్ అయినప్పటికీ 2022లో తన లక్ష్యాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉమా హారతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.