Sircilla News : సిరిసిల్ల నేతన్న మరో అద్భుతం, పట్టుబట్టపై జీ20 లోగో, దేశాధినేతల చిత్రాలు-sircilla handloom worker handcrafted g20 logo pm modi top leaders photos ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sircilla News : సిరిసిల్ల నేతన్న మరో అద్భుతం, పట్టుబట్టపై జీ20 లోగో, దేశాధినేతల చిత్రాలు

Sircilla News : సిరిసిల్ల నేతన్న మరో అద్భుతం, పట్టుబట్టపై జీ20 లోగో, దేశాధినేతల చిత్రాలు

HT Telugu Desk HT Telugu
Sep 11, 2023 07:01 PM IST

Sircilla News : అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన సిరిసిల్ల నేతన్న మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల నేతల చిత్రాలను చేతిమగ్గంపై ఆవిష్కరించారు.

పట్టుబట్టపై జీ20 దేశాల అధినేతల చిత్రాలు
పట్టుబట్టపై జీ20 దేశాల అధినేతల చిత్రాలు

Sircilla News : అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల కళాకారులు, మరో అపురూపమైన కళారూపాన్ని ఆవిష్కరించారు. దిల్లీ జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రతినిధుల చిత్రాలతో పాటు ప్రధానమంత్రి మోదీ చిత్రాన్ని చేతిమగ్గంపై ఆవిష్కరించి ఔరా అనిపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడైన హరిప్రసాద్ చిన్నతనం నుంచే నూలు పోగులతో అద్భుతాలను సృష్టిస్తున్నారు. గతంలో సిరిసిల్ల సిరిపట్టు అనే చీరను ఆవిష్కరించి గవర్నర్ తమిళి సై ప్రశంసలు అందుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే రాట్నం లాంటి ఎన్నో అద్భుతాలు హరిప్రసాద్ చేతిలో ఆవిష్కృతమయ్యాయి.

జాతీయ నేతలకు వారి ముఖచిత్రాలతో ఉన్న శాలువాలను నేసి, సిరిసిల్ల ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన నేతన్న మరో అద్భుతమైన కళాఖండాన్నితయారు చేశారు. దేశంలో జరిగిన జీ20 సమావేశాలకు హాజరైన 20 దేశాల ప్రతినిధుల చిత్రాలు, జీ20 లోగోతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని పట్టుబట్టపై జరిపోగులతో చేతిమగ్గంపై ఆవిష్కరించారు. వారం రోజుల పాటు కష్టపడి చేతిమగ్గంపై రెండు మీటర్ల వస్త్రంపై నేసి తన కళా నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. ప్రత్యేక లోగోలతో ఆవిష్కరించిన వస్త్రాన్ని చూసిన నేత కార్మికుడు హరిప్రసాద్ ను ప్రశంసిస్తున్నారు.

రిపోర్టర్ గోపికృష్ణ, సెంటర్ కరీంనగర్

IPL_Entry_Point