Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు కాలువలో గల్లంతయ్యారు.
Siddipet Crime : సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా మర్కుక్ లో జరిగింది. ముగ్గురు విద్యార్థులు కలిసి ఈతకోసం కొండపోచమ్మ కాలువకు వెళ్లారు. వారికి ఈత రాకపోవడంతో కాలువలో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరు మర్కుక్ గ్రామానికి చెందిన సంపత్ (12), వినయ్ (11) గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వాకింగ్ కు వెళ్తున్నామని చెప్పి
మర్కుక్ గ్రామానికి చెందిన రాజు, సంపత్, వినయ్ అనే ముగ్గురు చిన్నారులు సోమవారం ఉదయం 7.30 గంటలకు వాకింగ్ కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పారు. కానీ ఆ ముగ్గురు మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ దగ్గర పెద్ద కాలువలో ఈతకు దిగారు. వీరిలో వినయ్(11), సంపత్(12) ఇద్దరూ నీటిలో మునిగి గల్లంతు అయ్యారు. రాజుకు ఈత రావడంతో అతడు బయటపడగలిగాడు. సంపత్, వినయ్ డెడ్ మృతదేహాలను కాలువ నుంచి బయటకు తీశారు. ఈ ఘటనతో సంపత్, వినయ్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
ఈతకు వెళ్లి యువకుడు మృతి
స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు వ్యవసాయ బావిలో మునిగి మరణించాడు. తమిళనాడులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే యువకుడు వినయ్ సొంతూరు విజయపురం మండలం పోతులురాజులకండ్రిగ అని సమాచారం. పోతులరాజుల కండ్రిగకు చెందిన వరదరాజులు, మహేశ్వరి దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరి చిన్న కుమారుడు వినయ్ డిగ్రీ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. తమిళనాడు వేలూరు జిల్లాలోని శాకాడులో తన పిన్ని ఇంటికి వెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఆదివారం వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అయితే ఈతకు దిగిన వినయ్ బావిలో మునిగిపోయాడు. దీంతో స్నేహితులు వినయ్ పిన్ని ఇంట్లో సమాచారం అందించారు. స్థానికులు సమాచారంతో పోలీసులకు సహాయ చర్యలు చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు గాలింపు చేపట్టి ఫైర్ సిబ్బందికి వినయ్ మృతదేహాన్ని వెలికితీశారు. వినయ్ మృతిచెందిన సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు పోలీసులు.