EX Mlc To Congress: బీఆర్ఎస్‌కు షాక్... హస్తం పార్టీలోకి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు..CMతో మంతనాలు
EX Mlc To Congress: నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పడం లేదు. అధికారం కోల్పోయిన నాటి నుంచి పార్టీని పట్టించుకునే నాథుడు కరువు కాగా.. ద్వితియశ్రేణి నాయకత్వం హస్తం గూటికి చేరుతోంది.
EX Mlc To Congress: నిజామాబాద్ కారు పార్టీకి కష్టాలు తప్పడం లేదు. బిఆర్‌ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో BRS to Congress చేరేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. తాజాగా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ Rajeswar కారు దిగి హస్తంలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డితో CM Revanth భేటీ అయ్యారు.
బిఆర్‌ఎస్ నేత Rajeswarను సిఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిసింది. హస్తం పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన రాజేశ్వర్.. మళ్లీ అదే పార్టీలోకి రావడం విశేషం. నిజామాబాద్ Nizamabad నగరానికి చెందిన డి రాజేశ్వర్ కాంగ్రెస్ కార్యకర్తగా మున్సిపల్ కౌన్సిలర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి YSR అనుచరుడిగా రాజేశ్వరరావుకు మంచి పేరు ఉంది. జుక్కల్ నియోజకవర్గం నుంచి ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
వైఎస్ జమానాలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. వైయస్ అండతో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. వైఎస్ హఠాన్మారణం.. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో హస్తం పార్టీని వీడి కారెక్కారు.
టీఆర్ఎస్ సర్కారు క్రిస్టియన్ మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం కల్పించేందుకు కేసీఆర్ నిరాకరించారు. మరోసారి అవకాశం కోసం ప్రయత్నించినా ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు.
జుక్కల్ నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించారు. కానీ అదీ సాధ్యపడలేదు. టిక్కెట్టు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయనకు నిరాశే మిగిలింది. అప్పటి నుంచి రాజకీయంగా బీఆర్ఎస్‌లో కొంత వెనక్కు తగ్గారు.
పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర నిరాశతో ఉన్న ఆయన... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టి అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్‌ను వీడి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అంది వచ్చిన ఏ అవకాశాన్నీ జారనీయడం లేదు. అందులో భాగంగా కీలకమైన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చిక్కులు తప్పడం లేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పిటీసీలు, సొసైటీ ఛైర్మన్లు కారును వీడి హస్తం పార్టీలోకి చేరుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లూ అదే బాట పడుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్‌ను వీడటంతో మున్ముందు మరింత మంది పార్టీని వీడుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఒకప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత డి శ్రీనివాస్‌తో సహా ఒక్కొక్కరిగా కేసీఆర్ బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారయ్యింది. బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
(రిపోర్టింగ్ మీసా భాస్కర్, నిజామాబాద్)