Sangareddy Crime : సిగరెట్ కోసం స్నేహితుల మధ్య గొడవ, భవనంపై నుంచి పడి యువకుడు మృతి
Sangareddy Crime : సిగరెట్ కోసం ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలో ఒకరి ప్రాణం పోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో(Sangareddy) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్(Bihar) నుండి వచ్చిన ముగ్గురు స్నేహితులు ఓ పరిశ్రమలో పనిచేసుకుంటున్నారు. వీరు పార్టీ చేసుకున్న అనంతరం మద్యం మత్తులో సిగరెట్(cigarette) కోసం ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ తోపులాటలో ఓ యువకుడు భవనం పై నుంచి పడి మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్నేహితులు అశోక్, అంకిత్ ,రోషన్ లు బతుకుదెరువు కోసం వచ్చి కంది మండలం ఇంద్రకరణ్ పరిధిలోని ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసుకుంటూ, అక్కడే ఒక ఇంటి పెంట్ హౌస్ లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు ఆదివారం రాత్రి ఇంటి పైన మందు పార్టీ చేసుకున్నారు.
సిగరెట్ విషయంలో గొడవ
అనంతరం మద్యం మత్తులో సిగరెట్ విషయంలో అంకిత్, రోషన్ లు గొడవపడ్డారు. దీంతో మాటామాటా పెరిగి ఆవేశంతో అంకిత్ బిల్డింగ్ పైనుండి రోషన్ ను తోసేశాడు. బిల్డింగ్ పై నుంచి పడిన రోషన్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని మరొక ఫ్రెండ్ అశోక్ అర్ధరాత్రి ఇంటి ఓనర్ ని లేపి తెలియజేశాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. అంకిత్ అక్కడి నుంచి పారిపోయాడు. రోషన్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి(Sangareddy govt Hospital) తరలించారు. ఇంటి యజమాని కృష్ణయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్మీ ఉద్యోగం రాదేమోనని యువకుడు ఆత్మహత్య
తనకు ఇష్టమైన ఆర్మీ ఉద్యోగం(Army Job) రాదేమోనని మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా(Siddipet) మద్దూరు మండలం కూటిగల్ గ్రామంలో జరిగింది. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల బాలయ్య చిన్న కొడుకు రమేష్ (22) హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవు రోజుల్లో తండ్రికి వ్యవసాయ పనులలో సాయం చేస్తుంటాడు. ఎలాగైనా ఆర్మీ ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో హన్మకొండలో ఆర్మీ శిక్షణ కేంద్రానికి నెల రోజుల క్రితం వెళ్లాడు. అక్కడ శిక్షణ కేంద్ర నిర్వాహకులు మెడికల్ చెకప్ చేసి అతని చేతులు వంకరగా ఉన్నాయని నీకు కోచింగ్ ఇవ్వలేమని చెప్పారు. దీంతో తాను కోరుకున్న ఆర్మీ ఉద్యోగం రాదని భావించి రమేష్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. కాగా మనస్తాపం చెందిన రమేష్ ఈ నెల 16న వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. రమేష్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మృతుడి తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం