Mallikarjun Kharge : ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయ్- కేసీఆర్ పై ఖర్గే ఫైర్
Mallikarjun Kharge : తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు.
Mallikarjun Kharge : తెలంగాణ రాష్ట్రంతో విడదీయలేని అనుబంధం ఇందిరమ్మకు సొంతం అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. సంగారెడ్డిలో ఇందిరా గాంధీ కాలు మోపి యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారన్నారు. మెదక్ నుంచి ఎంపీగా నిలబడి, సంగారెడ్డితో అనుబంధంతో ఆమె గెలిచి దేశానికి ఆమె ప్రధానమంత్రి అయ్యారన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల కోసం చేసిన పని దేశంలో మరెవరూ చేయలేరన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మల్లికార్జున ఖర్గే ప్రసగించారు. పేదలను ఆదుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారన్నారు. ప్రధాని మోదీ పాలనలో కార్పొరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మల్లికార్జున ఖర్గే అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేదు
కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్‌లో ఎన్నో జాతీయ సంస్థలు నెలకొల్పిందని, వాటితో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని మల్లికార్జున ఖర్గే అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చిందని, ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేసి తీరుతుందన్నారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీ రుణాలు అంటూ ఇచ్చిన హామీలను కేసీఆర్ నేరవేర్చలేదని ఖర్గే విమర్శించారు. పండించిన పంటలను అమ్ముకోలేక కల్లాల్లోనే రైతులు చనిపోతున్న పరిస్థితులు చూస్తు్న్నామన్నారు.
రేవంత్ రెడ్డి విమర్శలు
సంగారెడ్డి గంజ్ మైదానంలో కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అందుకే సోనియా మరోసారి పూనుకొని ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని నిర్ణయం తీసుకున్నారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీలను చూపిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ సవాల్ విసిరితే కేటీఆర్ తోక ముడిచారని విమర్శించారు. కర్ణాటకకు వెళ్లడానికి బస్సు రెడీగా ఉందని, ప్రగతి భవన్ కు రావాలో, ఫామ్ హౌజ్ కు రావాలో కేసీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజీ గుండా పోతూ బీఆర్ఎస్ కట్టిన నాణ్యతలేని ప్రాజెక్ట్ చూద్దామన్నారు. పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తాకి కూలిందన్నట్లు మేడిగడ్డ పరిస్థితి ఉందని రేవంత్ విమర్శలు చేశారు. వీళ్లను జైలో వేసి చిప్ప కూడు తినిపించాలన్నారు.