Sangareddy District : ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మున్సిపల్ అధికారి-sadasivapet municipal officer caught by acb after demanding bribe ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy District : ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మున్సిపల్ అధికారి

Sangareddy District : ఇంటి నెంబర్ కోసం లంచం డిమాండ్ - ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన మున్సిపల్ అధికారి

HT Telugu Desk HT Telugu
Jan 18, 2024 02:24 PM IST

ACB Trap in Sangareddy District : సదాశివపేటలో ఇంటి నెంబర్ ను కేటాయించేందుకు రూ. 8 వేల లంచం డిమాండ్ చేసిన అధికారి ఏసీబీకి చిక్కాడు. కేసు నమోదు చేసిన అధికారులు… రిమాండ్ కు తరలిస్తున్నట్లు చెప్పారు.

ఏసీబీ స్వాధీనం చేసుకున్న డబ్బులు
ఏసీబీ స్వాధీనం చేసుకున్న డబ్బులు

ACB Trap in Sangareddy District : డబ్బులకు ఆశపడ్డ ఎంతోమంది ప్రభుత్వ అధికారులు అనిశా అధికారుల వలలో చిక్కుకొని తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నా… కొందరు అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మున్సిపాలిటీ లో మరొకటి జరిగింది. ఇంటి నెంబర్ కేటాయించడం కోసం సదాశివపేట మున్సిపల్ ఆఫీస్ లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ఆర్ వెంకట్ రావు బుధవారం ఒక వ్యక్తి నుండి రూ. 8 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు పట్టుబడ్డాడు.

yearly horoscope entry point

లంచం ఇవ్వకపోతే పని కాదు ....

సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణానికి చెందిన ఆకుల సంగమేశ్వర్, పట్టణంలోని హౌసింగ్ బోర్డు ఏకో వాలీ వెంచర్ లో నూతన గృహ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. కొత్త ఇంటి నెంబర్ కోసం సంగమేశ్వర్ ఆన్లైన్లో డిసెంబర్ 25 రోజు అప్లై చేసుకున్నాడు. ఇంటికి నెంబర్ ఇచ్చే ప్రక్రియ మొదలయిందని, ఒకసారి తనను వచ్చి కలవాలని ఆర్ ఐ వెంకట్రావు సంగమేశ్వర్ కుమారుడు శివ కుమార్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. సంగమేశ్వర్ అప్పటికే ఇంటికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాడు. అయినా ఇంటి నెంబర్ కేటాయించడానికి రూ. 10వేలు ఖర్చవుతుందని ఆర్ ఐ డిమాండ్ చేశాడు. అందుకు బాధితుడు అన్ని పత్రాలు సమర్పించాక డబ్బులు ఎందుకు ఖర్చవుతుందని అధికారిని ప్రశ్నించాడు. అనంతరం బాధితుడు కొన్నిరోజులపాటు కార్యాలయం చుట్టు తిరిగాడు, అయినా అధికారులు తనకు ఇంటి నెంబర్ ఇవ్వలేదు.

అనిశాకు సమాచారం…

దీంతో విసుగు చెందిన బాధితుడి కుమారుడు శివకుమార్ ఆర్ ఐ తో రూ. 8వేల లంచం ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత శివకుమార్ సంగారెడ్డి లోని అనిశా అధికారులను ఆశ్రయించాడు. అనిశా అధికారులు ఆదేశాల ప్రకారం, బుధవారం రోజు డబ్బులు ఇవ్వటానికి వెళ్లిన శివ కుమార్ ని ఆర్ ఐ వెంకట్రావు తన దగ్గర పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల్ శర్మకు ఆ నగదు ఇవ్వాలని సూచించారు. ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉన్నాయని, శివ కుమార్ ని బయటకి తీసుకెళ్లి అక్కడ ఆ డబ్బుని ఒక తెల్ల పేపర్లో చుట్టి ఇవ్వాలని కోరాడు వేణుగోపాల్ శర్మ. శివకుమార్ వేణుగోపాల్ శర్మకు రూ. 8 వేలు ఇస్తుండగా అనిశా అధికారులు రంగప్రవేశం చేసి పట్టుకున్నారు. ఆర్ ఐ వెంకట్రావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలిస్తామని డిఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో అనిశా సీఐ లు రమేష్, వేంకట్రాజ్ పాల్గొన్నారు.

రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి.

Whats_app_banner