Medak Murder: తమ్ముడి ప్రేమ వ్యవహారానికి అన్న బలి…
Medak Murder: చెల్లి ప్రేమించిన యువకుని కుటుంబంపై కత్తితో ఆమె సోదరుడు దాడి చేయడంతో, ప్రియుని సోదరుడు మృతి చెందిన ఘటన మెదక్‌లో జరిగింది.
Medak Murder: ఇంట్లో వారికి ఇష్టంలేని వ్యక్తితో వెళ్లి పోయిందనే కక్షతో, తన చెల్లిని తీసుకెళ్లిన యువకుని కుటుంబంపై ఓ యువకుడు దాడి చేశాడు. కత్తి తీసుకుని అబ్బాయి ఇంటికి వెళ్లి, నానా దుర్భాషలాడుతూ, తమ చెల్లిని తీసుకెళ్లిన కుటుంబాన్ని వదిలేది లేదని వాదనకు దిగాడు.
అతడిని అడ్డుకున్న చెల్లెలి ప్రియుడి అన్నపై కత్తితో దాడికి దిగడంతో రక్తపు మడుగులో కుప్పకూలాడు. కుటుంబసభ్యులు, స్థానికుల సహాయంతో తనకు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పటంతో, ఆ కుటుంబం మొత్తం దుఖ: సాగరంలో మునిగిపోయింది.
మెదక్ పట్టణంలోని నవాబుపేట ప్రాంతంలో నివాసం ఉంటున్న పోతరాజు ఉదయ్ పాల్, అదే కాలనీలో నివాసం ఉంటున్న భవాని కొంత కాలంగా ప్రేమించు కుంటున్నారు. ఇద్దరు ఒకే సామజిక వర్గానికి చెందిన వారైనా, అమ్మాయి కుటుంబ సభ్యులు వారి ప్రేమకు ఆమోదం తెలపలేదు.
ఎదిగిన అమ్మాయి ఇంట్లో నుండి వెళ్లిపోవటంతో.....
తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరని, భవాని, ఉదయ్ పాల్ ఇద్దరు కలిసి గత ఆదివారం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ కు పారిపోయారు. విషయం తెలిసిన భవాని కుటుంబసభ్యులు, ఎదిగిన అమ్మాయి ఇంట్లోనుండి వెళ్లిపోవటంతో అవమానం తట్టుకోలేకపోయారు.
ఉదయ్ పాల్, భవాని వెళ్లిపోవటంలో ఉదయ్ కుటుంబసభ్యుల మద్దతు కూడా ఉందని అనుమానించారు. ఈ నేపథ్యంలో, భవాని అన్న అంజిత్, సోమవారం రాత్రి ఉదయ్ పాల్ ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో వాదనకు దిగాడు. కత్తి చూపిస్తూ, వారికి జరిగిన అవమానానికి ఎన్నిరోజులైనా కక్ష తీర్చుకుంటానని బెదిరించాడు. తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన, ఉదయ్ సోదరుడు పోతరాజ్ నగేష్ (26) పై కత్తితో దాడికి దిగాడు.
నవాబుపేట లో ఉద్రిక్తత…
తీవ్ర గాయాలతో, నగేష్ మృతి చెందటంతో కాలనీ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాడీని పోస్టు మార్టమ్‌కు తరలించి, కాలనీ లో గొడవలు కాకుండా పికెట్ ఏర్పాటు చేసారు మెదక్ పోలీసులు.
ఇరువర్గాల మధ్య గొడవలు జరగకుండా, నగేష్ అంత్యక్రియలు జరిగేవరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ బాల స్వామి మెదక్ పట్టణ పోలీసులను కోరారు. అంజిత్‌ని తక్షణమే అదుపులోకి తీసుకున్న పోలీసులు, తనను విచారిస్తున్నారు. తమ్ముని ప్రేమ కోసం అన్న బలికావడంతో, ఆ కుటుంబలో తీవ్ర విషాదం నెలకొంది.