Cm Revanth Review: వారంలో మూడ్రోజులు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్న రేవంత్‌-revanth reddy announced that he will be available to mlas three days a week ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Review: వారంలో మూడ్రోజులు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్న రేవంత్‌

Cm Revanth Review: వారంలో మూడ్రోజులు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్న రేవంత్‌

Sarath chandra.B HT Telugu
Jan 09, 2024 08:32 AM IST

Cm Revanth Review: జనవరి 26 తర్వాత వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్‌ ఐదు జిల్లాల నేతలకు వివరించారు. పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు.

సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష
సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

Cm Revanth Review: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ఐదు జిల్లాల ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ నేతలతో సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని నేతలకు సీఎం సూచించారు.

ఈ నెల 26 తరువాత జిల్లాల పర్యటనకు వస్తానని సిఎంప్రకటించారు. ప్రతి రోజు సాయంత్రంపూట ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. వారంలో కనీసం మూడు రోజులు ఎమ్మెల్యేలకు సీఎం అందుబాటులో ఉంటానని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించాలని నిర్ణయించారు.

ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని జిల్లా నేతలకు సీఎం హామీ ఇచ్చారు.

అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇంచార్జి మంత్రులకు అప్పటించారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసా ఇచ్చారు. తాను గత సీఎంలా కాదని నేతలకు తేల్చి చెప్పారు.

వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్న సీఎం, పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 12కు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలిపించుకోవాలని సూచించారు.

Whats_app_banner