Khammam Crime: దేవాలయాలకు, మసీదులకు మత విద్వేష లేఖలు- భద్రాద్రి జిల్లాలో అరెస్ట్-religious hate letters to temples and mosques arrested in bhadradri district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Crime: దేవాలయాలకు, మసీదులకు మత విద్వేష లేఖలు- భద్రాద్రి జిల్లాలో అరెస్ట్

Khammam Crime: దేవాలయాలకు, మసీదులకు మత విద్వేష లేఖలు- భద్రాద్రి జిల్లాలో అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Jan 26, 2024 06:27 AM IST

Khammam Crime: దేవాలయాలు, మసీదులకు మత విద్వేష లేఖలు రాస్తున్న వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు.

మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

Khammam Crime: అల్లాను విద్వేషిస్తున్నట్లుగా హిందువుల పేరుతో మసీదులకు లేఖలు రాయడం.. అలాగే హిందు దేవుళ్లను దూషిస్తూ ముస్లింల పేర్లతో దేవాలయాలకు లేఖలు రాసి పోస్ట్ చేస్తున్న ఓ వ్యక్తి ఆట కట్టించారు పోలీసులు.

ఎంతో సున్నితమైన మత విద్వేషాలను రెచ్చగొడుతూ మత కల్లోలాలు సృష్టించాలని ప్రయత్నించిన వ్యక్తిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలోని హిందూ దేవాలయాలకు, మసీదులకు, అంతేకాకుండా అక్కడ నివసించే సామాన్య ప్రజల చిరునామాలకు సైతం మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాస్తున్న వ్యక్తిని చుంచుపల్లి పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.

గైక్వాడ్ కైలాష్ కుమార్, తండ్రి లక్ష్మణ్ అనే 53 సంవత్సరాల వ్యక్తి సీనియర్ క్లర్క్ గా అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. చుంచుపల్లి మండలం ఇంటి నెంబర్ 8-1-29/1 బాబుక్యాంప్ లో నివాసం ఉంటూ గత మూడు నెలలుగా మాస్క్ ధరించి కొత్తగూడెం పట్టణ పరిసర ప్రాంతాల్లో వివిధ ఏరియాల్లోని పోస్ట్ బాక్స్ లలో అసభ్యకరమైన పదజాలంతో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా లేఖలు రాస్తూ పోస్ట్ చేస్తున్నాడు.

బాబు క్యాంప్ ఏరియాలోని కొంతమంది మహిళలపై కూడా వారి శరీర భాగాలను అసభ్యంగా వర్ణిస్తూ లెటర్స్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. గత సంవత్సరం నవంబర్ నెలలో జిహాద్ పేరుతో బాబు క్యాంపులోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బెదిరింపు లెటర్స్ పంపించిన విషయంలో ఇతనిపై పోలీసులు మొదటి కేసును నమోదు చేశారు. ఆ సమయంలో అతడిని గట్టిగా హెచ్చరించడంతో పాటు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.

తాజాగా మరోసారి అదే తీరును ప్రదర్శించడంతో అతని వైఖరిలో ఏమాత్రం మార్పు రాలేదని స్పష్టమవుతోంది. హిందూ దేవాలయాలకు ముస్లింల పేరుతో, మసీదులకు హిందూ దేవాలయాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లెటర్స్ పంపుతున్న ఇతనిపై చుంచుపల్లి పోలీస్ స్టేషన్లో తాజాగా మరో 6 కేసులను నమోదు చేశారు.

చుంచుపల్లి పోలీసులు సీసీ టీవీ పుటేజీ ఆధారంగా బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇతని కదలికలను పసిగట్టి అరెస్టు చేశారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కొత్తగూడెం డిఎస్పీ రహమాన్, చుంచుపల్లి సిఐ పెద్దన్న కుమార్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.

ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందని, ఆ సామరస్య వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేదిలేదని హెచ్చరించారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

Whats_app_banner