Telangana Rains : తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరింత అప్రమత్తత అవసరం-red alert for 8 districts of heavy rains in telangana today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rains : తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరింత అప్రమత్తత అవసరం

Telangana Rains : తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరింత అప్రమత్తత అవసరం

Basani Shiva Kumar HT Telugu
Sep 02, 2024 07:14 AM IST

Telangana Rains : తెలంగాణ కుంభవృష్టితో విలవిల్లాడుతోంది. ఎక్కడ చూసిన వర్షం సృష్టించిన బీభత్సమే కనిపిస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా తేరుకోలేదు. అప్పుడే ఐఎండీ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. సోమవారం కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

తెలంగాణలోని 8 జిల్లాకు రెడ్ అలెర్ట్
తెలంగాణలోని 8 జిల్లాకు రెడ్ అలెర్ట్ (X)

తెలంగాణలోని పలు సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ సహా.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మంగళవారం నాడూ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని స్పష్టం చేస్తున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున తీరం దాటింది. కళింగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటినట్టు ఐఎండీ వెల్లడించింది. అక్కడి నుంచి వాయువ్య దిశగా కదులుతూ.. ఆదివారం సాయంత్రానికి రామగుండానికి 310 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించింది. ఇవాళ ఛత్తీస్‌ఘడ్, విదర్భ మీదుగా కదులుతూ.. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రుతు పవన గాలుల ద్రోణి మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతం నుంచి ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా.. బంగాళాఖాతం వరకు కొనసాగుతోందని అధికారులు వివరించారు. దీని కారణంగా ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని చెప్పారు.

ఈ జిల్లాల్లో వర్షాలు..

సోమవారం..ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ రోజు ఉదయం 8.30 గంటల వరకు.. ఆదిలాబాద్, నిజామాబాద్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

ఖమ్మం జిల్లాలో అత్యధికంగా..

ఆదివారం ఖమ్మం జిల్లా కాకరవాయి గ్రామంలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.65, వరంగల్ జిల్లా రెడ్లవాడలో 45.40, మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో 45.25, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 44.3, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో 43.5, పెద్దనాగారంలో 41.1, కొమ్ములవంచలో40, మల్యాలలో 37.1, దంతాలపల్లిలో 34.75, ఖమ్మం జిల్లా బచ్చోడలో 33.6 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

విద్యా సంస్థలకు సెలవు..

సోమ, మంగళవారాల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. అటు హైదరాబాద్‌లో పనిచేసే ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ కంపెనీలకు సూచించారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని.. అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు.