Love Marriage : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు, బతికుండగానే శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టిన తండ్రి-rajanna sircilla district father puts funeral poster for daughter after love marriage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Love Marriage : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు, బతికుండగానే శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టిన తండ్రి

Love Marriage : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు, బతికుండగానే శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టిన తండ్రి

Bandaru Satyaprasad HT Telugu
Apr 08, 2024 03:46 PM IST

Love Marriage : ఇన్నాళ్లు ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు...చెప్పకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని ఓ తండ్రి ఆవేదన చెందారు. తన కూతురు చనిపోయిందని శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టారు.

శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టిన తండ్రి
శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టిన తండ్రి

Love Marriage : ఇన్నాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు....ప్రేమ పెళ్లి (Love Marriage)చేసుకుని వెళ్లిపోయిందని ఓ తండ్రి తీవ్ర ఆవేదన చెందారు. తన బిడ్డను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురు ప్రేమ పెళ్లి చేసుకున్న వెళ్లిపోయిందని, ఆమెకు శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టాడు తండ్రి. సిరిసిల్లకు చెందిన చిలువేరి మురళి కుమార్తె 18 ఏళ్ల చిలువేరి అనూష తన తండ్రికి తెలియకుండా ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి మురళి ఇక తన కూతురు చనిపోయిందని శ్రద్ధాంజలి పోస్టర్‌ను పెట్టారు. తన కూతురు ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. మనస్థాపంతో ఆ తండ్రి చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి, మంచి కాలేజీలో చదువు చెప్పిస్తే... తన కూతురు తనను మోసం చేసిందని మురళి ఆవేదన చెందారు. తన బిడ్డ చేసిన మోసాన్ని తట్టుకోలేక శ్రద్ధాంజలి పోస్టర్(Demise Poster) పెట్టి, పిండ ప్రదానాలు చేశానని మురళి తెలిపారు.

కూతురికి శ్రద్ధాంజలి ఫ్లెక్సీ

రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)జిల్లాకు చెందిన చిలువేరి అనూష బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె కొద్దిరోజులుగా యువకుడిని ప్రేమలో ఉంది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే తమ పెళ్లికి ఒప్పుకోరనే భయంతో... ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. అనూష ఇంటికి తిరిగిరాకపోవడంతో అనూష తండ్రి మురళి... తెలిసిన వారికి, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. అయితే అనూష ఆచూకీ లేదు. ఇంతలో అనూష తల్లిదండ్రులకు షాక్ ఇస్తూ...ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తన కూతురు అనూష ప్రేమ పెళ్లి ఫొటో చూసి తండ్రి మురళి షాక్ కు గురయ్యారు. తన కూతురు అలాంటి పనిచేయదని, ఆమెను ట్రాప్ చేసి పెళ్లి (Love Marriage)చూసుకున్నాడని అనూష తండ్రి ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చేసిన పనికి తట్టుకోలేకపోయారు. తన కూతురు చనిపోయిందని, శ్రద్ధాంజలి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శ్రద్ధాంజలి పోస్టర్ ను ఇంటి అరుగుకు అంటించి తన ఆవేదన చెప్పుకున్నారు. మీపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులను మోసం చేయకండని వేడుకున్నారు. ఇన్నాళ్లు మీ కోసం బతికిన తల్లిదండ్రుల కోసం ఆలోచించాలని, ప్రేమ పెళ్లితో వదిలి వెళ్లిపోవద్దని సూచించారు. ప్రేమ పేరుతో తల్లిదండ్రుల గుండెలపై తన్నకండన్నారు. ఇన్నాళ్లు మీ కోసం తల్లిదండ్రులు చూపిందని ప్రేమ కాదా అని ఆ తండ్రి ప్రశ్నించారు.