Warangal Police: బండి సైలెన్సర్ మారిస్తే క్రిమినల్ కేసులు, టూ వీలర్స్ కు వరంగల్ పోలీసుల హెచ్చరిక-warangal police warns two wheelers against criminal cases if vehicle silencer is changed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Police: బండి సైలెన్సర్ మారిస్తే క్రిమినల్ కేసులు, టూ వీలర్స్ కు వరంగల్ పోలీసుల హెచ్చరిక

Warangal Police: బండి సైలెన్సర్ మారిస్తే క్రిమినల్ కేసులు, టూ వీలర్స్ కు వరంగల్ పోలీసుల హెచ్చరిక

HT Telugu Desk HT Telugu
Dec 11, 2024 09:25 AM IST

Warangal Police: ఎంతో ఇష్టంగా బైకులు కొనుగోలు చేస్తున్న యువత.. వాటి సైలెన్సర్లు మార్చేస్తూ పెద్ద శబ్ధంతో దూసుకెళ్తున్నారు. జనాల చూపులు తమ వైపు తిప్పుకునేలా మెయిన్ రోడ్లపై సైలెన్సర్ షార్ట్స్, స్పార్క్స్ ఇస్తూ బైకులను రయ్యిమనిస్తున్నారు. .

వరంగల్‌లో బైక్ సైలెన్సర్‌ల ధ్వంసం
వరంగల్‌లో బైక్ సైలెన్సర్‌ల ధ్వంసం

Warangal Police: ద్విచక్ర వాహనాలకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్ మారిస్తేs చట్టరీత్యా నేరమే కాకుండా దాని నుంచి వచ్చే సౌండ్స్ తో పెద్ద ఎత్తున శబ్ధ కాలుష్యం, జనాలకు ఇబ్బంది కూడా కలుగుతోంది

ఈ నేపథ్యంలో వరంగల్ పోలీసులు బైక్ సైలెన్సర్లు మార్చే బైకర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది ఇప్పటికే వరంగల్ కమిషనరేట్ వ్యాప్తంగా వెయ్యికిపైగా సైలెన్సర్లు స్వాధీనం చేసుకోగా.. ఇకనుంచి బండి సైలెన్సర్ మారిస్తే సంబంధిత ఓనర్ల పై క్రిమినల్ కేసులు బుక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కేసుల బారిన పడకుండా యువత సైలెన్సర్ శబ్ధాలకు దూరంగా వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు.

1142 సైలెన్సర్లు ధ్వంసం

బండ్లను స్టేటస్ సింబల్ గా భావిస్తున్న కొందరు స్టూడెంట్స్, యూత్ స్పోర్ట్స్ బైక్ లు, బుల్లెట్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇక రోడ్లపై వెళ్లే సమయంలో తామే స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించాలనే ఉద్దేశంతో బండ్లకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు మార్చేస్తున్నారు.

పెద్ద శబ్ధం వచ్చే సైలెన్సర్లను బింగించుకుంటున్నారు. ఇందుకు సైలెన్సర్లను బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆ తరువాత పెద్ద సౌండ్స్ తో మెయిన్ రోడ్లపై పరుగులు తీస్తున్నారు. వాస్తవానికి ఇలా సైలెన్సర్ మార్చడం మోటార్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 183 ప్రకారం నేరం. దీంతోనే వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల సైలెన్సర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ మేరకు వరంగల్ నగరంలోని హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ రైడ్స్ నిర్వహించారు.

ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తంగా 1,142 సైలెన్సర్లు సీజ్ చేశారు. అందులో అత్యధికంగా హనుమకొండ స్టేషన్ పరిధిలో 470, కాజీపేట స్టేషన్ పరిధిలో 352, వరంగల్ స్టేషన్ పరిధిలో 320 సైలెన్సర్లను సీజ్ చేశారు. అనంతరం రోడ్డు రోలర్ల సహాయంతో ధ్వంసం చేశారు.

ఇక నుంచి క్రిమినల్ కేసులే

మోటార్ వెహికిల్ యాక్ట్ సెక్షన్ 183 ప్రకారం సైలెన్సర్ మార్పు విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. ఇకనుంచి పెద్ద సౌండ్స్ చేసే సైలెన్సర్లు అమర్చిన బైకులపై కఠిన చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు బండి ఓనర్లపై క్రిమినల్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా బండిని సీజ్ చేయడంతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. పిల్లల బండ్లపై తల్లిదండ్రులు కూడా నిఘా పెట్టాలని, పిల్లలు సైలెన్సర్లు మార్చినా తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

మెకానిక్‌లకూ చిక్కులు తప్పవు

సాధారణంగా బండి సైలెన్సర్ మార్చాలంటే మెకానిక్ ల అవసరం తప్పనిసరిగా ఉంటుంది. పాత సైలెన్సర్ ఊడదీయాలన్నా.. కొత్తది బిగించాలన్నా.. వారు స్పానర్లు తిప్పక తప్పదు. కాగా బండ్ల సైలెన్సర్లు మారిస్తే మెకానిక్ లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లలో పట్టుబడిన సైలెన్సర్లను సీజ్ చేయడంతో పాటు మెకానిక్ లను కూడా ట్రేస్ చేస్తామని, అనంతరం వారిపైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కంపెనీతో వచ్చిన సైలెన్సర్లు మార్చకుండా ఉండాలని, నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు మార్చి అనవసర చిక్కుల్లో పడొద్దని వరంగల్ పోలీసులు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner