Vishal Mega Mart IPO : విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ప్రారంభం.. కచ్చితంగా తెలుసుకోవాల్సిన 8 విషయాలు!
Vishal Mega Mart IPO GMP : విశాల్ మెగా మార్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ సంస్థ ఐపీఓకు వచ్చింది. డిసెంబర్ 11న సబ్‌స్క్రిప్షన్ మెుదలైంది. డిసెంబర్ 13న ముగుస్తుంది. మూడు రోజులు బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంది.
విశాల్ మెగా మార్ట్ లిమిటెడ్ ఐపీఓ నేటి నుంచి సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు. బిడ్డింగ్ కోసం ఓపెన్ అయింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ మొత్తం రూ.8,000 కోట్లను సమీకరించాలని చూస్తోంది. విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్, గ్రే మార్కెట్ ప్రీమియంతో పాటు కీలక వివరాలు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
విశాల్ మెగా మార్ట్ లిమిటెడ్ బుధవారం భారత స్టాక్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. డిసెంబరు 11వ తేదీ ఉదయం 10 గంటలకు బిడ్‌ల కోసం ఓపెన్ అయింది. డిసెంబర్ 13 శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది.
హైపర్ మార్కెట్ కంపెనీ విశాల్ మెగా మార్ట్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.74 నుంచి రూ.78గా నిర్ణయించింది. ఈ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 1,025,641,025 షేర్లను విక్రయిస్తోంది. విశాల్ మెగా మార్ట్ ఇష్యూ ధరను రూ.74-రూ.78గా నిర్ణయించింది. రిటైల్ పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ అంటే 190 షేర్లకు వేలం వేయవచ్చు. మీరు రూ.78 ఐపీఓ ధర బ్యాండ్ ప్రకారం 1 లాట్ కోసం దరఖాస్తు చేస్తే రూ.4,820 పెట్టుబడి పెట్టాలి.
అయితే, రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్‌లు అంటే 2470 షేర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం పెట్టుబడిదారులు పైన పేర్కొన్న ధర బ్యాండ్ ప్రకారం రూ.192,660 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 391 నగరాల్లో 600కి పైగా స్టోర్లను కలిగి ఉన్న విశాల్ మెగా మార్ట్ నేటి గ్రే మార్కెట్ ప్రీమియం రూ.26తో ట్రేడవుతోంది. విశాల్ మెగా మార్ట్ ఐపీఓ కింద క్యూఐబీ పెట్టుబడిదారులు 50 శాతం, ఎన్ఐఐ ఇన్వెస్టర్లు 15 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు 35 శాతం రిజర్వ్ చేసి ఉంటుంది.
విశాల్ మెగా మార్ట్ 2001లో స్థాపించారు. ఇది దుస్తులు, కిరాణా, ఎలక్ట్రానిక్స్, గృహావసరాలను విక్రయించే హైపర్ మార్కెట్ చైన్. సెప్టెంబర్ 30, 2024 నాటికి కంపెనీ దేశవ్యాప్తంగా 391 నగరాల్లో 600 కంటే ఎక్కువ స్టోర్‌లను కలిగి ఉంది. 16,537 మంది ఉద్యోగులను ఇందులో పని చేస్తున్నారు. దీనితో పాటు కంపెనీ తన ఉత్పత్తులను మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా విక్రయిస్తుంది. విశాల్ మెగా మార్ట్ ఐపీఓ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
1. మార్కెట్ పరిశీలకుల ప్రకారం విశాల్ మెగా మార్ట్ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 26 ప్రీమియతో లభిస్తాయి.
2. హైపర్‌మార్కెట్ చైన్ కంపెనీ ఈక్విటీ షేర్‌కి ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను రూ.74 నుండి రూ.78గా నిర్ణయించింది.
3. ఈ ఐపీఓ పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం డిసెంబర్ 11 బుధవారం ఓపెన్ అయింది. డిసెంబర్ 13 శుక్రవారంతో ముగుస్తుంది.
4. కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ. 8,000 కోట్లను సమీకరించనుంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జరుగుతుంది.
5. ఒక లాట్‌ను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు 190 షేర్లకు వేలం వేయాలి.
6. కంపెనీ డిసెంబర్ 14, 2024 శనివారం నాడు అలాట్‌మెంట్ చేయవచ్చు. ఆలస్యమైతే డిసెంబర్ 16న కేటాయింపులు జరిగే అవకాశం ఉంది.
7. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్, జెఫరీస్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్‌లీ ఇండియా ఈ ఐపీఓ కోసం లీడ్ మేనేజర్లుగా ఎంపిక అయ్యాయి.
8. ఐపీఓ బిడ్, కేటాయింపు పూర్తయిన తర్వాత విశాల్ మెగా మార్ట్ డిసెంబర్ 18, 2024న లిస్టింగ్ చేయవచ్చు.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం సమాచారం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోండి.