AP TG Weather Updates : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, తెలంగాణలో పొడి వాతావరణం
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణలో మాత్రం పొడి వాతావరణమే ఉండనుంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం … తీవ్రఅల్పపీడనంగా కేంద్రీకృతమైందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతూ కొనసాగే అవకాశం ఉందని వివరించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఇవాళ (డిసెంబర్ 11) నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు,బాపట్ల,పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
రేపు భారీ వర్షాలు…!
గురువారం(డిసెంబర్ 12) నెల్లూరు,అనంతపురం,శ్రీ సత్యసాయి,వైఎస్ఆర్,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు,నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు అధికారులు హెచ్చరికలు జారీ అయ్యారు. పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలే ఏపీలో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లోని రైతులు.. తీవ్రంగా నష్టపోయారు. అయితే తాజాగా తీవ్ర అల్పపీడన ప్రభావంతో కూడా పలు జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్నదాతులు జాగ్గత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో పొడి వాతావరణం :
ఇక తెలంగాణలో చూస్తే ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తిగా పొడి వాతావరణణే ఉంటుందని అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని కూడా పేర్కొంది. ఉదయం వేళలో కొన్ని జిల్లాల్లో మాత్రం... పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ చూస్తే... ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృత్తమై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో గంటకు 06 - 08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎలాంటి వర్ష సూచన లేదని వివరించింది. ఉదయం సమయంలో మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని తాజా బులెటిన్ లో పేర్కొంది.