Ponnam Sathaiah Goud Award : పొన్నం సత్తయ్య అవార్డుల ప్రదానోత్సవం - హాజరైన స్పీకర్, మంత్రులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల(2024)ను అందజేశారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.
Ponnam Sathaiah Goud Awards 2024: రవీంద్ర భారతిలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల(2024)ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మంత్రులు శ్రీదర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పొన్నం సత్తయ్య గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు చేతుల మీదుగా ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారులు కొమురమ్మ, మొగులయ్యలకు పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు.
ఆదర్శ రైతు పొన్నం సత్తయ్య గౌడ్ - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ఈ సందర్భంగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. అవార్డులు అందుకున్న వారికి శుభకాంక్షలు తెలిపారు. పొన్నం సత్తయ్య పేరిట చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారి కుమారులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. పొన్నం సత్తయ్య గౌడ్ గారికి చదువు విలువ తెలుసని… ఆయనకు చదువు రాకున్నా కుమారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించారని చెప్పారు.
భూమిని నమ్ముకున్న ఆదర్శ రైతు పొన్నం సత్తయ్య గౌడ్ అని స్పీకర్ ప్రసాద్ కుమార్ కొనియాడారు. ఏనాడూ ప్రచారాన్ని కోరుకొని భూమి పుత్రుడు సత్తయ్య అని చెప్పుకొచ్చారు. బలగం సినిమాలో మొగులయ్య దంపతులు పాడిన పాటలు అభినందనీయం ప్రశంసించారు. వారి కుటుంబ నేపథ్యంలో చూస్తే చాలా బాధగా అనిపిస్తుందన్నారు. వారికి తన జీతం నుంచి లక్ష రూపాయలను తక్షణ సాయం కింద అందిస్తున్నట్లు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి సాకారంతో పెన్షన్ ఇచ్చేలా చేస్తానని హామీనిచ్చారు.
కొముర్వకు ఇళ్లు కటిస్తాం - మంత్రి పొన్నం హామీ
మంత్రి పొన్నం ప్రభాకర్ (పొన్నం సత్తయ్య గౌడ్ కుమారుడు) మాట్లాడుతూ…మొగులయ్య దంపతులు పాడిన పాటను ప్రత్యేకంగా ప్రశంసించారు. “ మా కుటుంబం తరుపున వరంగల్ లో మీకు ఇళ్లు కడతాం. వారం రోజుల్లో మీ భర్తను తీసుకొచ్చి చికిత్స అందిస్తాం . మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. కొమురవ్వకు కళాకారుల కోటా కింద పెన్షన్ ఇవ్వాలి”అని కోరారు.
పొన్నం సత్తయ్య పట్టుదల వ్యక్తి - మంత్రి శ్రీధర్ బాబు
ఐటీ మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ… పొన్నం సత్తయ్య గౌడ్ మంచితనాన్ని గుర్తు చేసుకున్నారు. “పొన్నం ప్రభాకర్ గారి ఇంటికి అనేక సందర్భాల్లో వెళ్ళే వాళ్ళం . వారు మమల్ని ఆత్మీయంగా దగ్గరకు తీసేవారు. కుటుంబ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకుపోతున్న వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కుటుంబం అంటే పొన్నం గారి కుటుంబం. పొన్నం ప్రభాకర్ మంత్రి అయినా వారి అన్నదమ్ములు ,అక్క చెల్లెళ్ల సలహాలు సూచనలతో ఉంటారు. ఎంత ఎదిగినా ,ఒదిగి ఉండాలని ఆయనను చూస్తే తెలుస్తుంది. రాబోయే తరానికి ఒక మేసేజ్ ఇచ్చే కార్యక్రమం ఇది. పొన్నం సత్తయ్య పట్టుదల వ్యక్తి ...ఆలోచన పరుడు. వారి లేని లోటును ఎవరు తీర్చలేనిది” అని చెప్పారు.
ఉమ్మడి కుటుంబానికి నెలవు - మంత్రి జూపల్లి
రాష్ట్ర పర్యాటక శాఖ జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… పొన్నం సత్తయ్య గౌడ్ 14 వ వర్ధంతి అయినా తరువాత కూడా ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నామంటే వారి జీవన విధానమే కారణమన్నారు. పుత్రులు ప్రయోజకులు కావాలని పొన్నం సత్తయ్య దంపతులు కోరుకునేదని గుర్తు చేశారు. బొంబాయిలో పనులు చేసి, రైతు బిడ్డగా కూడా వచ్చి పిల్లలను మంచి చదువులు చదివించారని కొనియాడారు. పొన్నం సత్తయ్య గౌడ్ ది ఉమ్మడి కుటుంబమని… సంస్కృతి సంప్రదాయాలకు నెలవని చెప్పుకొచ్చారు. బలగం సినిమాలో కొమురమ్మ పాట వింటే అందరి కళ్లు చెమర్చాయన్నారు. వారికి ప్రభుత్వం తరుపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు.
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ… అవార్డు గ్రహీతలు శుభాకాంక్షలు చెప్పారు. పొన్నం సత్తయ్య గౌడ్ నిరక్షరాస్యులైనప్పటికీ… కుటుంబాన్ని గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి అని కొనియాడారు.
సంతోషంగా ఉంది - చంద్రబోస్, పొన్నం సత్తయ్య అవార్డు గ్రహీత
అవార్డు గ్రహీతీ చంద్రబోస్ మాట్లాడుతూ.. పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు స్థానిక కళాకారులతో కలిసి అవార్డు అందుకోవడం అంతే ఆనందంగా ఉందని చెప్పారు. 3500 కి పైగా పాటలు పాడానని… తన పాటకు స్ఫూర్తి ఒగ్గు కళాకారుల కళారూపమని చెప్పుకొచ్చారు. ఈ అవార్డుతో గుండె బరువెక్కిందన్నారు. పొన్నం సుపుత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
అవార్డు గ్రహీత కొమురవ్వ మాట్లాడుతూ… అవార్డుతో సత్కరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 14 సంవత్సరాల తరువాత కూడా తండ్రి జ్ఞాపకార్థంపై అవార్డులు ఇవ్వటాన్ని అభినందించారు. వేదికపై పొన్నం సత్తయ్య గౌడ్ మీద పాట పాడి ఆలపించారు.
మా నాన్నకు ఒగ్గు కథలంటే ఇష్టం - పొన్నం రవిచంద్ర గౌడ్
పొన్నం సత్తయ్య గౌడ్ మరో కుమారుడు పొన్నం రవిచంద్ర గౌడ్ మాట్లాడుతూ… “మా బాపుకు కళాకారులు , రచయితలు అంటే ఇష్టం. ఆయనకు ఆరో ప్రాణం రేడియో. చనిపోయే వరకు రేడియో లో కథలు,నాటికలు వార్తలు వినేవారు. మా బాపు కు ఒగ్గు కథలు,బుర్ర కథలు అంటే ఇష్టం. గత 3 సంవత్సరాలుగా పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్నాం” అని చెప్పారు.
ఏపి మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ… సత్తయ్య కుటుంబాన్ని చూస్తే ఉమ్మడి కుటుంబం యొక్క ఆవశ్యకత తెలుస్తుందన్నారు. రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. తన కొడుకును పార్లమెంట్ సభ్యుడిగా తీర్చిదిద్దారన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం, సంజయ్, శ్రీ గణేష్ , వీర్లపల్లి శంకర్ , నాగరాజు , మేఘారెడ్డి , బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్,రవాణా రోడ్స్ అండ్ బిల్డింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ,బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళభరణం కృష్ణమోహన్ రావు , వెలిచాల రాజేందర్ రావు ,మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి ,రచయిత్రి శ్రీ లక్ష్మి ,సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరి కృష్ణ ,మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ పాల్గొన్నారు.
సంబంధిత కథనం