Patancheru Congress : నీలం మధుకి టికెట్ ఇస్తే మద్దతు ఇవ్వం-పటాన్ చెరు కాంగ్రెస్ నేతలు
Patancheru Congress : తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయినా పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన నీలం మధుకి టకెట్ ఇస్తే మద్దతు ఇవ్వమని స్థానిక కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Patancheru Congress : శుక్రవారం నుంచి రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొదలు అయినప్పటికీ, సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పార్టీలోకి నీలం మధుని తీసుకొచ్చి, పార్టీ బలాన్ని పెంచుకుందాం అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తే ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్, ఈసారి అందరికంటే ముందుగానే మండలాల్లో కాంగ్రెస్ ఆఫీసులు ఓపెన్ చేశారు.
కాంగ్రెస్ కార్యాలయాలు ఖాళీ
అయితే నీలం మధు పార్టీలో చేరిన తర్వాత, మధుకి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుండటంతో, పఠాన్ చెరువు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అన్ని ఖాళీగా కనపడుతున్నాయి. నీలం మధుకి కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే ప్రచారం, కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్ర నైరాశ్యంలో ముంచింది. ఈ సారి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన నీలం మధు, తన పార్టీ నాయకత్వం వరుసగా మూడోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే టికెట్ ఇవ్వడంతో తీవ్ర నిరాశతో పార్టీని వీడారు. వారం రోజుల కింద కాంగ్రెస్ పార్టీలో చేరిన మధు, టికెట్ కోసం పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతూ దిల్లీలోనే మకాం వేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి టికెట్ కోరుకుంటున్న కాటా శ్రీనివాస్ గౌడ్ కు కూడా పిలుపు వచ్చింది.
నీలం మధుకి టికెట్ ప్రతిపాదనను తిరస్కరించిన కాటా
కాంగ్రెస్ అధిష్టానం మధుకి టికెట్ ఇస్తాం ఇద్దరు కలిసి పనిచేసుకోండి అని అధిష్టానం ఆదేశిస్తే, కాటా ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తుంది. జిల్లాలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నరసింహ కూడా కాటాకు టికెట్ ఇవ్వాలని అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది ఇలా ఉండగా, నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాత్రం నీలం మధుకి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వమని అంటున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కుటుంబం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉందని, వారం రోజుల కింద పార్టీలోకి వచ్చిన వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని వారు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండగా, పఠాన్ చెరువు కాంగ్రెస్ లో మాత్రం తీవ్ర సందిగ్ధం నెలకొంది. పార్టీ అధిష్టానం, పఠాన్ చెరు నియోజకవర్గ అభ్యర్థిత్వం పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని, కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.