ACB Trap : రిజిస్ట్రేషన్ కు 80 వేల లంచం డిమాండ్ - ఏసీబీకి చిక్కిన పరకాల సబ్ రిజిస్ట్రార్
ప్లాట్ రిజిస్ట్రేషన్ కు రూ.80 వేల లంచం డిమాండ్ చేసిన పరకాల సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కారు. మధ్యవర్తిగా ఉన్న ప్రైవేటు డాక్యూమెంట్ రైటర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
తండ్రికి చెందిన ఇంటి స్థలాన్ని కొడుకుల పేరున రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ సబ్ రిజిస్ట్రార్ పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసింది. మధ్యవర్తిగా డాక్యుమెంట్ రైటర్ ద్వారా బేరసారాలు నడిపించింది. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీని ఆశ్రయించగా, గురువారం అనిశా అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడిన అధికారిణిని వల పన్ని పట్టుకున్నారు.
వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు అనే వ్యక్తికి అదే మండలంలోని మాదారం గ్రామ శివారులో దాదాపు 12 వందల గజాల స్థలం ఉంది. దానిని ఆయన కొడుకులైన లడే శ్రీనివాస్, లడే శ్రీకాంత్ కు పంచేందుకు నిర్ణయించుకున్నాడు. మొత్తంగా ఆ ప్లాట్ ను నాలుగు భాగాలుగా రిజిస్ట్రేషన్ చేసేందుకు నిశ్చ యించుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో పాటు ఏమేం ధ్రువ పత్రాలు అవసరమో తెలుసుకునేందుకు ఈ నెల మొదటి వారంలో పరకాలలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వెళ్లాడు.
80 వేల లంచం డిమాండ్…
ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లిన లడే శ్రీనివాస్ అక్కడి అధికారులను కలిశాడు. సబ్ రిజిస్ట్రార్ సునీతను సంప్రదించగా, ఆమె అక్కడే ఉన్న ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ను కలవాలని చెప్పింది. దీంతో వారు డాక్యుమెంట్ రైటర్ నరేష్ ను కలిశారు.
తమ ల్యాండ్ ను నాలుగు పార్ట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ తో మాట్లాడి వచ్చిన నరేష్ ఒక్కో పార్ట్ రిజిస్ట్రేషన్ కు రూ.20 వేల చొప్పున నాలుగు పార్ట్ లకు మొత్తం రూ.80 వేలు సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేసినట్లు తెలిపాడు. దీంతో వారు బేరసారాలు ఆడగా, ఆ మొత్తం డబ్బులు ఇచ్చిన తరువాతనే రిజిస్ట్రేషన్ అవుతుందని నరేష్ తేల్చి చెప్పాడు. దీంతో న్యాయమైన పనికి లంచం ఇవ్వడం ఇష్టం లేని లడే శ్రీనివాస్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
డబ్బులు ఇచ్చిన తరువాతే రిజిస్ట్రేషన్…
డబ్బులు ఇచ్చిన తరువాతనే రిజిస్ట్రేషన్ చేస్తామని నరేష్ చెప్పడంతో లడే శ్రీనివాస్ ఏసీబీ అధికారులు చెప్పినట్టుగా 80 వేలు తీసుకెళ్లాడు. ఏసీబీ అధికారుల ప్లాన్ ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని నరేష్కు రూ.80 వేలు ముట్ట జెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చిన తరువాతనే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
ఇదిలాఉంటే తమ ప్లాన్ లో భాగంగా అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇతర అధికారులు డబ్బులు తీసుకున్న నరేష్ ను పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా సబ్ రిజిస్ట్రార్ సునీత ఆదేశాల మేరకే తాను 80 వేలు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ సునీతతో పాటు డాక్యుమెంట్ రైటర్ నరేష్ అరెస్టు చేశారు. వారిని శుక్రవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ సాంబయ్య వివరించారు.