Hyd ACB Trap: సస్పెండైనా సిగ్గు పడకుండా లంచం డిమాండ్ చేసి ఏసీబీకి దొరికిన సీసీఎస్ సిఐ
Hyd ACB Trap: అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన సీసీఎస్ సిఐ ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. గతంలో మధ్యలో వదిలేసిన సెటిల్‌మెంట్లను సొమ్ము చేసుకోడానికి బెదిరింపులకు పాల్పడ్డాడు.బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వలపన్ని పట్టుకున్నారు.
Hyd ACB Trap: హైదరాబాద్‌లో ఓ అవినీతి పోలీస్ ఏసీబీకి చిక్కాడు. 5 లక్షల రుపాయల లంచం తీసుకుంటూ సంగారెడ్డి సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ దొరికిపోయాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన సిఐ ప్రస్తుతం విధుల్లో కూడా లేరు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంలో నమోదు చేసిన కేసును సెటిల్ చేయడానికి కోటిన్నర డిమాండ్ చేసి డబ్బు వసూలు చేస్తుండగా వలపన్ని పట్టుకున్నారు.
సంగారెడ్డి సీసీఎస్‌లో సీఐగా పనిచేస్తున్న మట్టపర్తి సాయివెంకట కిషోర్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. సీఐ సాయివెంకట కిశోర్.. అమీన్‌పూర్‌లో ఉంటున్న స్థిరాస్తి వ్యాపారి రవిగౌడ్‌ను కొద్దినెలలుగా డబ్బుల కోసం వేధిస్తున్నారు. వెంకట కిషోర్ గతంలో అమీన్‌పూర్ సీఐగా పనిచేశాడు. అప్పట్లో సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో రవిగౌడ్ నిందితుడిగా ఉన్నాడు.
ఈ కేసులో అతని పేరును తొలగించి, కేసుదర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలను ఇవ్వాలంటే రూ.1.50 కోట్ల నగదు లేదంటే అమీన్‌పూర్‌లో రెండు ఫ్లాట్లను రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆస్తి పత్రాల కోసం రెండు నెలల కిందట సిఐ కిషోర్‌కు రవిగౌడ్ రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన రూ.1.40 కోట్లు తొందరగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండగానే, అమీన్‌పూర్ నుంచి సంగారెడ్డి సీసీఎస్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత కూడా సిఐ బెదిరింపులు ఆగలేదు. సీసీఎస్‌కు బదిలీ తర్వాత సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
ఆ తర్వాత కూడా తీరు మార్చుకోకుండా అమీన్‌పూర్‌కు వచ్చిన కొత్త అధికారుల సాయంతో రవిగౌడ్‌ను వేధించడం ప్రారంభించాడు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం రూ.5 లక్షలు ఇస్తానని సిఐకు ఫోన్ చేయడంతో మియాపూర్‌లోని మయూర్‌మార్గ్ వద్దకు వచ్చాడు. అక్కడ డబ్బులను తీసుకుని, లెక్కిస్తుండగా కిశోర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఈ కేసులో ఫిర్యాదు దారుడు రవిగౌడ్ సంగారెడ్డిలో నమోదైన భూలావాదేవీ జరిగిన వివాదం కేసులో నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో అతని వద్ద నుంచి భూములకు సంబంధించిన పత్రాలను సిఐ స్వాధీనం చేసుకున్నాడు. వాటిని కోర్టుకు సమర్పించకుండా తన వద్దే ఉంచుకుని వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో రవిగౌడ్ జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
భూముల పత్రాలను ఇవ్వాలంటే కోటిన్నర ఇవ్వాలని సిఐ బెదిరింపులకు పాల్పడ్డాడు. రూ.10లక్షలు ఇచ్చినా మిగిలిన మొత్తం ఇవ్వాల్సిందేనని బెదిరించడంతో ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
మరో కేసులో మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మునిసిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఆఫీసులోనే ఏసీబీకి చిక్కారు. సోమవారం మునిసిపల్ ఆఫీసు చాంబర్‌లోనే రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు.
దమ్మాయిగూడ మునిసిపాలిటీలోని స్థలం విషయంలో ముషీరాబాద్‌కు చెందిన సుదర్శన్‌కు అతని వ్యాపార భాగస్వామి సత్యనారాయణకు మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. సుదర్శన్‌కు చెందిన మూడు గుంటల స్థలాన్ని సత్యనారాయణ కబ్జా చేసి రోడ్డు లేకుండా అడ్డుగా గోడ నిర్మించాడు. ఆ గోడను కూల్చి వేయాలని ఫిర్యాదు చేస్తే కమిషనర్ రాజమల్లయ్యను రూ.60వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై సుదర్శన్.. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రూ.30వేలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.