OU PG Exams : ఓయూ పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా, ఆగస్టు 16 నుంచి ఎగ్జామ్స్
OU PG Exams : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పీజీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 16 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్వహించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఓయూ వీసీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
OU PG Exams : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పీజీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. జులై 28 నుంచి నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను విద్యార్థుల ఆందోళన మేరకు ఆగస్టు 16 నుంచి నిర్వహించాలని ఓయూ అధికారులు నిర్ణయించారు. ఓయూ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్ త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదాతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో క్యాంపస్, అనుబంధ కాలేజీలు, జిల్లా పీజీ సెంటర్ల ప్రిన్సిపాల్స్‌తో పాటు ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు. జులై 26, 27 తేదీల్లో ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యార్థుల ఆందోళనలతో
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు ఇటీవల ఆందోళన చేపట్టారు. ఈ నెల 28 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని ఓయూ విద్యార్థులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ నెరవేర్చలని ఓయూలో రోడ్డుపై బైఠాయించారు. వీసీ వచ్చి హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఓయూ విద్యార్థులు ఆందోళన చేశారు. సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విద్యార్థులు ప్రశ్నించారు. సెప్టెంబర్ లో నిర్వహించాల్సిన పీజీ సైన్స్ రెండో, నాలుగో పరీక్షలను జులైలో ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. పరీక్షలు వాయిదా వేసేదాక తమ ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఓయూ వీసీ ఉన్నతాధికారులు, తమ పరిస్థితి అర్థం చేసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ రూల్స్ ప్రకారం సెమిస్టర్‌కు కనీసం 120 పని దినాల తర్వాతే పరీక్షలు పెట్టాల్సి ఉంటుందని విద్యార్థులు అన్నారు. అయితే కనీసం రెండు నెలలు కూడా పాఠాలు చెప్పకుండానే ఓయూ అధికారులు పరీక్షలు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగి...సిలబస్ పూర్తైన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణపై వీసీకి వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనతో దిగివచ్చిన ఓయూ అధికారులు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 16 నుంచి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. రీషెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామన్నారు.