TG Agri Diploma Admissions: తెలంగాణ వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
TG Agri Diploma Admissions: తెలంగాణలో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి విద్యార్హతతో అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
TG Agri Diploma Admissions: తెలంగాణలోని వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 25వరకు విద్యార్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించేందుకు గడువుగా నిర్ణయించారు. 26వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్ కాలేజీల్లో రెండేళ్ళ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, మూడేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఈ కోర్సులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అయితే రూ.600, ఇతరులు రూ.1200 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజును రూపే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇతర మాస్టర్, వీసా డెబిట్ కార్డుల ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులు యూనివర్శిటీ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు మొదటి సెమెస్టర్‌లో రూ.19.460 రుపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజులు, మెస్ ఛార్జీలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
యూనివర్శిటీ అనుబంధ కాలేజీల్లో చేరే విద్యార్ధులు సెమెస్టర్‌కు రూ.22,210 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. హాస్టల్ ఫీజులు, మెస్ చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 2024-25 విద్య సంవత్సరంలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్ధులు అడ్మిషన్ల ప్రక్రియ ముగియడానికి ముందే తమ ప్రవేశాన్ని రద్దు చేసుకుంటే వెయ్యి రుపాయలు మినహాయించుకుని మిగిలిన మొత్తం తిరిగి చెల్లిస్తారు. అడ్మిషన్ల గడువు ముగిసిన తర్వాత విద్యార్థి తన అడ్మిషన్ రద్దు చేసుకుంటే అదనంగా మరో రూ.1000 రుపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ప్రొఫెసర్ జయశం కర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నో టిఫికేషన్ విడుదల చేశారు. పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు.
దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై, తెలంగాణ పాలిసెట్ రాసి ర్యాంకు పొంది ఉండాలి. ఈ కోర్సులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 260 సీట్లు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 540 సీట్లు ఉన్నాయి. వాటిలో 60 శాతం సీట్లను గ్రామీణ కోటాలో దరఖాస్తు చేసే విద్యార్ధులకు, 40 శాతం సీట్లను గ్రామీణేతర కోటాలో భర్తీ చేయనున్నారు.
గ్రామీణ కోటాలో భర్తీ చేసే సీట్లకు దరఖాస్తు చేసే విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతంలో చదివినట్లు సంబంధిత పాఠశాల ప్రధానోపా ధ్యాయుడి నుంచి ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో దానిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ సీట్లను రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి వివరించారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్‌లో https://diploma.pjtsau.ac.in/ అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు, కాలేజీల వివరాలకు నోటిఫికేషన్ డాక్యుమెంట్లను పరిశీలించండి.