Nalgonda BRS : హ్యాట్రిక్ వేటలో ఆ అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Nalgonda BRS : అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ నేతలు రెడీ అవుతున్నారు. ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ నేతలు ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తు్న్నారు.
Nalgonda BRS : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించారు. ఈసారి అయిదుగురు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్నారు.
2014 వరకు ఒకే సీటు
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి 2014 ఎన్నికల దాకా జిల్లాలో ఆ పార్టీ గెలిచిన ఒకే ఒక్క సీటు ఆలేరు. 2004 ఎన్నికల్లో డాక్టర్ కుడుదుల నగేష్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాజకీయ వ్యూహంలో భాగంగా అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయడంతో 2008లో ఉపఎన్నికలు జరిగాయి. ఆలేరు ఉపఎన్నికల్లో సైతం ఆయనకే విజయం దక్కింది. మళ్లీ విజయం కోసం ఆ పార్టీ దశాబ్దకాలం పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో జిల్లాలో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ ఆరుగురిలో 2018 ఎన్నికల్లో ఇద్దరు ఓటమి పాలైయ్యారు. నలుగురు మాత్రం రెండోసారి కూడా గెలిచారు. మళ్లీ ఇపుడు 2023 ఎన్నికల్లో మూడో విజయం కోసం ఆ నలుగురు నాయకులు వేచి చూస్తున్నారు. వీరే కాకుండా కాంగ్రెస్ నుంచి ఒకసారి, బీఆర్ఎస్ నుంచి రెండోసారి గెలిచిన ఓ ఎమ్మెల్యే సైతం మూడో విజయం కోసం క్యూలో ఉన్నారు.
ఎవరా అయిదుగురు ?
2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. సూర్యాపేట నుంచి జి.జగదీష్ రెడ్డి, తుంగతుర్తి నుంచి గాదరి కిషోర్ కుమార్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి, మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నకిరేకల్ నుంచి వేముల వీరేశం ఆ ఎన్నికల్లో విజయసం సొంతం చేసుకున్నారు. కానీ 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ మునుగోడు, నకిరేకల్ స్థానాలను కోల్పోయింది. కానీ ఆ పార్టీ ఖాతాలో కొత్తగా 2018లోనే నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడెం నియోజకవర్గాలు వచ్చి చేరాయి. 2014 ఎన్నికల్లో మిర్యాలగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎన్.భాస్కర్ రావు కొన్నాళ్లకు గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. 2018లో అదే స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ పై గెలుపొందారు. ఈ ఎన్నికలకూ ఆయనకు టికెట్ దక్కింది. ఇపుడు జిల్లాలో మొత్తంగా అయిదుగరు ఎమ్మెల్యేలు వరసగా మూడో గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే, మంత్రి జి.జగదీష్ రెడ్డి, తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మిర్యాలగూడెం ఎమ్మెల్యే ఎన్.భాస్కర్ రావు.. ఇలా అయిదుగురు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ విజయం కోసం ఎదురుచూస్తున్నారు.