CM KCR : కాంగ్రెస్ ను నమ్మి అధికారం ఇస్తే పంటికి అంటకుండా మింగేస్తారు - సీఎం కేసీఆర్-nagarkurnool cm kcr says telangana top in the country per capita income ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Nagarkurnool Cm Kcr Says Telangana Top In The Country Per Capita Income

CM KCR : కాంగ్రెస్ ను నమ్మి అధికారం ఇస్తే పంటికి అంటకుండా మింగేస్తారు - సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
Jun 06, 2023 08:58 PM IST

CM KCR : తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకున్నామన్నారు. తెలంగాణలో చీకట్లు పోయి వెలుగు జిలుగులు వచ్చాయన్నారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR : తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటి అయిపోతుందని అందరూ అన్నారని, ఇప్పుడు రాష్ట్రంలో వెలుగు జిలుగులు ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. నాగర్ కర్నూలులో పర్యటించిన సీఎం కేసీఆర్... కలెక్టరేట్, ఎస్పీ, బీఆర్ఎస్ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రలో చిమ్మ చీకట్లు ఉంటే, తెలంగాణ వెలిగిపోతోందన్నారు. గతంలో భూ రిజిస్ట్రేషన్లకు నాలుగైదు రోజులు పట్టేదని, ఎంతో డబ్బు ఖర్చయ్యేదన్నారు. ధరణి పోర్టల్ ను ఓ ప్రబుద్ధుడు తీసేస్తామన్నారని, గంగలో కలిపేస్తామని విమర్శలు చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. భూముల రిజిస్ట్రేషన్లు మార్చాలంటే ఇంతకు ముందు అధికారుల చేతుల్లో ఉండేదన్నారు. ఇప్పుడు భూమి మరొకరి పేరు పైకి రాసే హక్కు వీఆర్వో నుంచి సీఎం వరకూ ఎవరికీ లేదన్నారు. భూమి ఉన్న రైతు వేలి ముద్ర వేస్తేనే మరొకరి పేరు మీదకి భూమి మార్చే అవకాశం ఉంటుందన్నారు. భూ రిజిస్ట్రేషన్ కేవలం 10 నిమిషాల్లో పూర్తి అవుతుందన్నారు. ధరణి లేకపోతే రైతు బంధు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.

రైతులను బంగాళాఖాతంలో పడేసినట్లే

కొత్త వేషాలతో మళ్లీ మోసగాళ్లు బయలుదేరారని కేసీఆర్ విమర్శించారు. పాలమూరు జిల్లా నుంచి వచ్చిన ఒకాయన ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారని, ధరణిని బంగాళాఖాతంలో వేస్తే రైతులను బంగాళాఖాతంలో వేసినట్టే అని కేసీఆర్ అన్నారు. ధరణి రాక ముందు అంతా లంచాలమయమే అన్నారు. ధరణి వల్ల ఒకశాతం సమస్యలు ఉంటే ఉండవచ్చు కానీ ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం సీఎం కూడా లేదన్నారు. ధరణి లేకపోతే ఎన్ని గొడవలు, హత్యలు జరిగేవో ఆలోచించాలన్నారు. మళ్లీ రైతులను పోలీస్‌ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని విమర్శించారు. నమ్మి అధికారమిస్తే పంటికి అంటకుండా మింగేయడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ రాజ్యంలో దళారులదే అధికారమన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

తలసరి ఆదాయంలో టాప్

పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తొమ్మిదేళ్లు గ‌డిచిపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుని, అగ్రస్థానంలో నిలిచామన్నారు. త‌ల‌స‌రి ఆదాయంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులో ముందున్నామన్నారు. సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామన్నారు. అణగారిని ద‌ళిత జాతిని ఉద్దరించాల‌నే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబానికి 10 ల‌క్షలు ద‌ళిత‌బంధు ద్వారా ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక నాడు ముంబయి బ‌స్సుల‌కు ఆల‌వాలం పాల‌మూరు అన్నారు. ఒకనాడు పాలమూరులో గంజి కేంద్రాలు ఉండేవన్నారు. గంజి కేంద్రాలు పోయి పంట కొనుగోలు కేంద్రాలు వచ్చాయన్నారు. కేసీఆర్ రాక‌ముందు ఇక్కడ్నుంచి మంత్రులు ఉన్నారు కానీ మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇవాళ మిష‌న్ భ‌గీర‌థ ద్వారా కృష్ణా నీళ్లు ఇస్తున్నామన్నారు. పాలమూరులో ఐదు మెడిక‌ల్ కాలేజీలు వ‌చ్చాయని తెలిపారు.

పాలమూరుకు ప్రత్యేక స్థానం

తెలంగాణ రాష్ట్రం రాకపోతే నాగ‌ర్‌ క‌ర్నూల్ జిల్లా అయ్యేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్యాల‌యాలు వ‌చ్చేవి కావన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఓ చ‌రిత్ర ఉందన్నారు. ఒక‌ప్పుడు ఉమ్మడి పాల‌మూరు జిల్లాలో చాలా వెనుక‌బాటు త‌నం ఉండేదన్నారు. ప్రజలు సాగు, తాగునీటికి , క‌రెంట్‌కు ఇబ్బంది పడే వారని, వాటిని అర్థం చేసుకునేందుకే పాల‌మూరు ఎంపీగా ఉండాల‌ని నిర్ణయించుకున్నానన్నారు. జ‌య‌ శంక‌ర్ సార్ సూచ‌న మేర‌కు పాల‌మూరు ఎంపీగా పోటీ చేసి గెలిచానని కేసీఆర్ తెలిపారు. ఆ రోజు పాల‌మూరు జిల్లాలో ఉద్యమం అంత బ‌లంగా లేదని, కానీ ప్రజలు చూపించిన ఆద‌ర‌ణ‌తో ఎంపీగా గెలిచానన్నారు. ద్యమ చ‌రిత్రలో పాల‌మూరు జిల్లా పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. ఈ జిల్లా ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించామన్నారు.

IPL_Entry_Point