Munugode Politics : కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన చలమల్ల, మునుగోడులో బీజేపీకి అభ్యర్థి దొరికినట్టేనా!
Munugode Politics : మునుగోజు రాజకీయాలు మరో ములుపు తిరిగాయి. బీజేపీ షాకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం గూటికి చేరితో... కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి చలమల్ల క్రిష్ణారెడ్డి బీజేపీలో చేరారు.
Munugode Politics : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో మార్పు జరిగింది. మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఆ పార్టీ నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి పార్టీ మారారు. తనను నమ్మించి మోసం చేశారని అభియోగిస్తూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలోనే చలమల్ల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆ ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీకి దిగగా, కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని చలమల్ల క్రిష్ణారెడ్డి ఆశించారు. కానీ, పార్టీ నాయకత్వం ఆ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిరెడ్డికి టికెట్ ఇచ్చింది. ఉప ఎన్నికల సమయంలోనే చలమల్లకు స్పష్టమైన హామీ ఇచ్చారని, 2023 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇస్తామన్న భరోసాతోనే ఆయన కాంగ్రెస్ వెంట నడిచినట్లు చెబుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాకతో అంతా తారుమారు
ఈసారి ఎన్నికల్లో తనకే టికెట్ అన్న విశ్వాసంలో ఉన్న చలమల్లకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం షాకిచ్చింది. వాస్తవానికి ఈ సారి మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఉపఎన్నికల అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి, చలమల్ల క్రిష్ణారెడ్డి, బీసీ నాయకుడు పున్న కైలాస్ నేత ప్రయత్నించారు. చలమల్లకు దాదాపు టికెట్ వచ్చే పరిస్థితి ఉందన్న ప్రచారం కూడా జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి దగ్గరి అనుచరుడు కావడం, గత ఏడాది ఉప ఎన్నికల సమయంలోనే రేవంత్ రెడ్డి చలమల్లకు హామీ ఇవ్వడంతో ఇక టికెట్ ఆయనదే అని అనుకున్నారంతా. కానీ, ఈలోగా బీజేపీకి ఝలక్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. పార్టీలో చేరిన మరునాటి ఉదయమే ఆయనకు ఏఐసీసీ నాయకత్వం మునుగోడు టికెట్ ను ప్రకటించింది. తనకు అన్యాయం చేశారని, తనకే టికెట్ ఇవ్వాలని చలమల్ల మొత్తుకున్నా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. తన అనుచరులు, అనుయాయులతో సమావేశం అయ్యాక చలమల్ల క్రిష్ణారెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ సరైన అభ్యర్థి కోసం బీజేపీ కూడా వెదులాటలో ఉండగా, చలమల్ల క్రిష్ణారెడ్డి రూపంలో వారి కాళ్లకు ఓ తీగ తగిలింది.
ఫలించిన బీజేపీ వెదుకులాట
తెలంగాణ శాసనసభ ఎన్నికల బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న రాజగోపాల్ రెడ్డి రాత్రికి రాత్రే పార్టీ మారడంతో ఈసారి ఇక్కడి నుంచి ఎవరిని పోటీకి దించాలనే ఆలోచనల్లో పడిపోయింది బీజేపీ. మాజీ ఎంపీ డాక్టర్ బూరనర్సయ్య గౌడ్ ను పోటీకి దించుతారని కూడా ప్రచారం జరిగింది. గతంలో రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి పేరును కూడా పరిశీలించినట్లు సమాచారం. అయితే, ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బయటి నుంచి ఎవరినైనా తీసుకువచ్చే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ లోగా కాంగ్రెస్ లో జరిగిన పరిణామాలు బీజేకి కలిసి వచ్చాయంటున్నారు. టికెట్ రాలేదన్న కారణంగా చలమల్ల క్రిష్ణారెడ్డి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ నాయకత్వం ఆయనకు గాలం వేసి తమ పార్టీ కండువా కప్పింది. ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా చలమల్ల క్రిష్ణారెడ్డిని బరిలోకి దింపడం దాదాపు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా, మునుగోడు కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన కృష్ణారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు హైదరాబాద్ కొత్తపేటలోని కృష్ణారెడ్డి నివాసానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వెళ్లారు. కిషన్ రెడ్డి సమక్షంలో చలమల్ల కాషాయ కండువా కప్పుకోవడంతో ఆయన బీజేపీ చేరిక పూర్తయ్యింది. ఇప్పుడు బీజేపీ నాయకత్వం చలమల్ల క్రిష్ణారెడ్డికి అధికారికంగా టికెట్ ప్రకటించడమే మిగిలింది.