BJP MP Arvind : చెంప దెబ్బ కొట్టిన హోంమంత్రిపై కేసు నమోదు చేయాలి - ఎంపీ అర్వింద్
MP Dharmapuri Arvind:పోలీసు కానిస్టేబుల్ ను హోంమంత్రి చెంపదెబ్బ కొట్టడంపై ఎంపీ అర్వింద్ స్పందించారు.తక్షణమే హోం మంత్రి పదవికి మహమ్మద్ అలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Dharmapuri Arvind: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా హోం మంత్రి మహమ్మద్ అలీ తన భద్రత సిబ్బంది పై చేయి చేసుకున్న ఘటన పై బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు అధికార అహంకారంతో విర్రవీగుతున్నారని మండిపడ్డారు. రక్షణ కల్పించే భద్రత సిబ్బంది పై హోంమంత్రి మహమ్మద్ అలీ చేయి చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. మహమ్మద్ అలీ భద్రత సిబ్బంది పై చేయి చేసుకుంటున్న వీడియోను చూపిస్తూ.. అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ స్పందించాలన్నారు.అధికార అహంతో తన సొంతభద్రత సిబ్బంది చెంపపై కొట్టిన మహమ్మద్ అలీ పై తక్షణమే డీజీపీ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సంఘటన అత్యంత సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.కాగా అటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం,శ్రేణులు సైతం ఈ ఘటనపై సామాజిక మాద్యమాల్లో స్పందిస్తూ హోమ్ మినిస్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఇదే ఘటనపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు.తెలంగాణ అనే రాష్ట్రం కేవలం ఒక్క కేసీఆర్, అతని అవినీతి కుటుంబం కోసమే ఏర్పడలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాల పాటు పోరాటం జరిగిందని… 1997లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదానికి బిజెపి మద్దతునిచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి 60 ఏళ్లు అవకాశం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లో విఫలం అయిందన్నారు. అందుకే 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ పై చిత్తశుద్ది ,ప్రేమ ఉన్న నాయకుడు నరేంద్ర మోదీ అని ,తెలంగాణ పై చిత్తశుద్ది ఉన్న పార్టీ బీజేపీనేనీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ ఈ రెండు కుటుంబ పార్టీలను ఓటుతో ఓడించాల్సిన సమయం అసన్నమైందన్నారు.
ఏం జరిగిందంటే…?
శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమైంది. ఇందులో మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇక అమీర్ పేటలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి చెందిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని ప్రారంభించారు. అయితే శుక్రవారం తలసాని జన్మదినం కావటంతో…. హోంమంత్రి శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా…. బోకే గురించి తన వెనక ఉన్న సెక్యూరిటీ గార్డు సిబ్బందిని అడిగారు. బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో క్షణాల వ్యవధిలోనే హోంమంత్రి సహనం కోల్పోయారు. సెక్యూరిటీ గార్డు చెంపపై కొట్టారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కాగా… మంత్రి తలసాని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఇక చెంప దిన్న సెక్యూరిటీ గార్డు… అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత వెనక వైపు నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు మహమూద్ అలీ. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హోంమంత్రి మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
రిపోర్టర్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్
సంబంధిత కథనం