Karimnagar: మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో కరీంనగర్ – జగిత్యాల రోడ్డు,NH563 విస్తరణపై బండి ఫోకస్-modis 100 day action plan bandis focus is on the widening of the karimnagar jagityala road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar: మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో కరీంనగర్ – జగిత్యాల రోడ్డు,Nh563 విస్తరణపై బండి ఫోకస్

Karimnagar: మోదీ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో కరీంనగర్ – జగిత్యాల రోడ్డు,NH563 విస్తరణపై బండి ఫోకస్

HT Telugu Desk HT Telugu
Jul 08, 2024 06:35 AM IST

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.

జాతీయ రహదారి విస్తరణపై సమీక్షిస్తున్న బండి సంజయ్...
జాతీయ రహదారి విస్తరణపై సమీక్షిస్తున్న బండి సంజయ్...

Karimnagar: కరీంనగర్‌ జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయం, ప్రధానంగా కరీంనగర్–జగిత్యాల, కరీంనగర్ – వరంగల్ (ఎన్ హెచ్ 563) జాతీయ రహదారి విస్తరణ పనులపై ఫోకస్ చేశారు. కరీంనగర్ లోని తన కార్యాలయంలో ఎన్ హెచ్ ఏఐ అధికారులతో సమావేశమయ్యారు.

కరీంనగర్ నుండి వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయి? ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు? అట్లాగే కరీంనగర్ నుండి జగిత్యాల వరకు జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? భూసేకరణ ఎంత వరకు వచ్చింది? టెండర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? పనులెప్పుడు మొదలుపెడతారు? ఈ విషయంలో ఎదురువుతున్న ఇబ్బందులేమిటి? అనే అంశాలపై అధికారులతో చర్చించారు.

15 రోజుల్లో టెండర్లు...40 శాతం పూరైన భూసేకరణ..

కరీంనగర్ – జగిత్యాల జాతీయ రహదారి(ఎన్ హెచ్ 563) విస్తరణ పనులకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలో కరీంనగర్ – జగిత్యాల రహదారి విస్తరణ పనుల అంశం ఉండటంతో సెప్టెంబర్ లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు.

ఈ రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ 40 శాతం మేరకు పూర్తయ్యిందని, త్వరలోనే భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రహదారి విస్తరణలో భాగంగా మూడు ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.2,227 కోట్ల అంచనా వ్యయంతో 58 కి.మీల పొడవున చేపట్టే విస్తరణ పనుల్లో భాగంగా 6 మేజర్, 18 మైనర్ బ్రిడ్జిలతోపాటు195 కల్వర్టులను నిర్మించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురువుతున్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించగా.. సంబంధిత జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా విస్తరణ పనులను పూర్తి చేయాలి…

అంతకుముందు కరీంనగర్ నుండి వరంగల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై మంత్రి బండి సంజయ్ ఆరా తీయగా ‘ఇప్పటి వరకు 37 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 2025 జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ నుండి వరంగల్ వరకు 68.015 కి.మీల మేరకు జాతీయ రహదారి విస్తరణ పనులు 37 శాతం మేరకు పూర్తయ్యాయన్నారు.

వచ్చే ఏడాది జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్ పర్తి వద్ద బైపాస్ లను నిర్మించనున్నట్లు తెలిపారు. 29 మైనర్ జంక్షన్లను నిర్మించనున్నామన్నారు. గట్టుదుద్దెనపల్లి, చెంజర్ల లో భూ సేకరణ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు.

వెంటనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో ఫోన్ లో మాట్లాడారు. కరీంనగర్ ఆర్డీవో ను పిలిపించి భూ సేకరణ సమస్యను పరిష్కరించాలని సూచించారు. అట్లాగే కొన్నిచోట్ల సర్వీస్, స్ట్రక్చరల్ రోడ్ల ఏర్పాటుపై ప్రజల నుండి వినతులు అందుతున్నాయని అధికారులు పేర్కొనడంతో... ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో బండి సంజయ్ తోపాటు ఎన్ హెచ్ ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, అధికారులు క్రిష్ణారెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు రమేశ్ త్రిపాఠి, కమలేశ్ తదితరులు పాల్గొన్నారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

WhatsApp channel