HYDRA Demolitions : హైడ్రా కూల్చివేతలపై ఆలోచించాలి - ఆ విషయం ముందే చెప్పా! ఎమ్మెల్యే దానం కీలక వ్యాఖ్యలు
హైడ్రా కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుడిసెల జోలికి వెళ్లటం మంచిది కాదని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళన అవసరమే అన్న ఆయన… పేదల ఇళ్ల కూల్చే విషయంపై ఆలోచించాలన్నారు.
హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు హాట్ టాపిక్ గా మారాయి. బాధితులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు హైడ్రా బుల్డోజర్లు మాత్రమే ఆగే పరిస్థితి కనిపించటం లేదు. మూసీ పరివాహక ప్రాంతంలోనూ మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్.. బాధితులకు అండగా ఉంటామని చెబుతోంది. ఆదివారం పలు కాలనీల్లో పర్యటించింది.
హైడ్రా కూల్చివేతలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పానని… కానీ ఆ విషయంలో తనను బద్నాం చేసే విధంగా వార్తలు రాశారని గుర్తు చేశారు.
పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాల్సిందని అభిప్రాయపడ్డారు. కూల్చిన ఇళ్లకు సమీపంలోనే నివాసం ఏర్పాటు చేస్తే మంచిదన్నారు. మూసీ ప్రక్షాళన అవసరం ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మూసీ విపత్తు పరిణామాల నుంచి ప్రజలకు ఇబ్బందుల కలగొద్దని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని అన్నారు. పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి ఉచ్చులో ప్రజలు పడొద్దని కోరారు. పేదలకు అన్యాయం జరగకుండా సీఎం రేవంత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు:
హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు FTLలో కట్టుకున్న ఇళ్లే కూల్చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్ లో ఉన్నవాటిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే కొనసాగుతోంది. ఇళ్లను మార్కింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. పలు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక డెస్క్ లను కూడా ఏర్పాటు చేశారు. నిర్వాహిసితుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు.