Ellampalli Project: పర్యాటక కేంద్రంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్‌బాబు
Ellampalli Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎల్లంపల్లికి ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు, గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Ellampalli Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎల్లంపల్లికి ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు, గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ మున్సిపల్ , నీటిపారుదలశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష సిపి శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
వరద పరిస్థితి గురించి ఆరా తీసి అధికారులతో సమీక్షించారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుండి పెద్దఎత్తున వరద రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంకా వర్షం ఉన్న నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు టూరిజం స్పాట్ చేస్తాం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కుగా మారిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అని చెప్పారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నిరూపయోగంగా మారిన పరిస్థితులు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని మిడ్ మానేర్ కు లిఫ్ట్ చేసి అక్కడి నుంచి అటు ఎల్ఎండికి ఇటు అన్నపూర్ణ రిజర్వాయర్ కు ఎత్తిపోయడం జరుగుతుందన్నారు.
అన్నపూర్ణ నుంచి రంగానాయక్ సాగర్ కు దాని నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్ కు తద్వారా మల్లన్న సాగర్ కు నీటిని లిఫ్టు చేసి ప్రాజెక్టులన్ని నింపనున్నామని తెలిపారు. ప్రాధాన్యత గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు.
ప్రాజెక్టు సమీపంలో 70 ఎకరాల స్థలం ఉందని ఆ స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ౠ మక్కాన్ సింగ్ కోరుతున్నారని ఆయన ప్రతిపాదనను పరిశీలించి ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)