KTR : ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్నారు.. ఎక్కడికి పోయాయి మోదీజీ?-minister ktr letter to pm modi over employment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్నారు.. ఎక్కడికి పోయాయి మోదీజీ?

KTR : ఏటా 2 కోట్ల ఉద్యోగాలన్నారు.. ఎక్కడికి పోయాయి మోదీజీ?

HT Telugu Desk HT Telugu
Jun 09, 2022 09:22 PM IST

కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్నారు.. ఎక్కడికి పోయాయని మోదీని ప్రశ్నించారు.

<p>కేటీఆర్</p>
కేటీఆర్ (Stock Photo)

ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుందంటూ ప్రధానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని లేఖలో మోదీని ప్రశ్నించారు. పరిమిత వనరులతో తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలను కల్పిస్తుందన్నారు. కేంద్రం మాత్రం ఉద్యోగాల భర్తీని వదిలేసి నిద్రపోతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

లేఖలో కేటీఆర్ ఏం రాశారంటే..

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైంది. నూతన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు ఆకర్షించింది. ప్రైవేట్ రంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను కల్పించాం. ప్రభుత్వ రంగంలోనూ ఇప్పటి వరకు సుమారు లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. తాజాగా మరో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మెప్పు పొందగలుగుతున్నాం.

దేశ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ప్రధానమంత్రిగా మోదీ విఫలమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్ధానాలు అధికారంలోకి వచ్చాక మరిచిపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆ మాటలన్నీ ఢాంభికాలే అనేందుకు ఎనిమిదేళ్ల పాలనే నిదర్శనం. అసమర్థ నిర్ణయాలు, ఆర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు. నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తాకింది. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించడంలో నరేంద్ర మోదీకి స్పష్టమైన విధానం లేదు. వ్యవసాయం, టెక్స్​టైల్ రంగ అభివృద్ధిపై మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడంతో చిన్న పొరుగు దేశాల క‌న్నా త‌క్కువ‌మందికి ఆ రంగాల్లో ఉపాధి ల‌భిస్తోంది. ఇలాంటి విధానాల వ‌ల్ల 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది.

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని ప్రధాని నరేంద్ర మోదీ గొప్పలు చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం సబ్ కో సత్తేనాశ్ కరో అన్నట్టే వ్యవహరిస్తున్నారు. బీజేపీ వైఖ‌రితో కేవ‌లం దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భార‌తీయుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతోంది. విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడి.. కోట్లాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పుడైనా తెలంగాణ గ‌డ్డ నుంచి దేశ యువ‌త‌కు ఉపాది, ఉద్యోగ క‌ల్పనపై వైఖ‌రి స్పష్టం చేయాలి.

Whats_app_banner