ఆరు గ్యారంటీలు వంద రోజుల్లోనే అమలు : మంత్రి దామోదర రాజనర్సింహ
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోపే అమలు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
మెదక్ : ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు అందించే దిశగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారుల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని అందరి సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. నాయకుల తత్వం, గుణం వేరువేరుగా ఉంటుందని, సిస్టం అన్నది ఒకే విధంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, వాటి ఆచరణ, అమలు చేయడంలో అధికారుల పాత్ర కీలకమన్నారు.
ప్రభుత్వానికి, పరిపాలనకు అధికార గణం గుండె లాంటిదని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి అర్హులకు అందజేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా సేవలందించే ప్రభుత్వ పరిపాలనకు అనుగుణంగా అధికారుల పనితీరు ఉండాలన్నారు.
ఈనెల 28 నుండి జనవరి 6 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గ్రామసభలలో దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి సమన్వయంతో పనిచేసినప్పుడే ఏ పథకమైన విజయవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు అవుతాయన్నారు. జిల్లా యంత్రాంగం అందరూ టీం స్పిరిట్ తో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే దిశగా ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రసీదు ఇవ్వాలని సూచించారు. చేసే ప్రతి పని పారదర్శకంగా, బాధ్యతయుతంగా ఉండాలని, అధికారులు ఒత్తిడి లేకుండా నిబంధనలకు లోబడి పని చేయాలని సూచించారు. కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
టాపిక్