Medchal News : మేడ్చల్ లో విషాదం, స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి!
Medchal News : మేడ్చల్ జిల్లా ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. అన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించేందుకు వచ్చిన చిన్నారి ఈ ప్రమాదానికి గురైంది.
Medchal News : స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
మూడేళ్ల చిన్నారిని బలిగొన్న స్కూల్ బస్సు
చిన్నారి భవిష్య (3) తన అన్నయ్య స్కూల్ కు వెళుతుండగా తల్లితో పాటు బస్సు వద్దకు వెళ్లింది. ఎప్పటిలానే ఆనంద్ నగర్ కాలనీ నుంచి రచన గ్రామర్ స్కూల్ బస్సులో చిన్నారి భవిష్య అన్నయ స్కూల్ కు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం తల్లితో పాటు అన్నయ్యను స్కూల్ బస్సును ఎక్కించేందుకు చిన్నారి భవిష్య వెళ్లగా అంతలోనే డ్రైవర్ చిన్నారిని ఢీ కొట్టాడు. తీవ్రగాయాల పాలైన భవిష్యను తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లితండ్రులు రోదనలు మిన్నంటాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే భవిష్య మృతి చెందిందని వారి బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
డెలివరీ బాయ్ ను ఢీ కొన్న స్కూల్ బస్సు-యువకుడి మృతి
డెలివరీ బాయ్ స్కూటీను ఓ స్కూల్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాచుపల్లికి చెందిన మొహమ్మద్ పాషా కుమారుడు మొహమ్మద్ మోసిన్ (20) బ్లింకిట్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.శుక్రవారం బచుపల్లి చౌరస్తా నుంచి మియాపూర్ వైపు వెళుతున్న సమయంలో మొసిన్ స్కూటీని బొల్లారం చౌరస్తా వద్ద అతివేగంతో వెనుక వైపు నుంచి ఓ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు. యువకుడి తండ్రి పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్