Medak House Collapse : మెదక్ లో విషాదం, ఇంటి పైకప్పు కూలి వృద్దురాలు మృతి
Medak House Collapse : మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నానిన పెంకుటిల్లు పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మరణించింది. బాధితులకు మంత్రి దామోదర రాజనర్సింహా రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు.
Medak House Collapse : మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెంకుటిల్లు పైకప్పు కూలడంతో....నిద్రిస్తున్న ఓ వృద్దురాలు దుర్మరణం చెందింది. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టేక్మాల్ చెందిన మంగలి శంకరమ్మ(64), దత్తయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహాలు కాగా, ఇద్దరు కుమారులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. మరొక కొడుకు టేక్మాల్ లోనే మరో ఇంట్లో ఉంటున్నారు.
ఇంటి పైకప్పు, దూలాలు ఆమెపై పడడంతో
ఈ క్రమంలో దత్తయ్య, శంకరమ్మ దంపతులు పురాతన ఇంట్లో నివసిస్తున్నారు. కాగా దత్తయ్య కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత దత్తయ్యను ఒక గదిలో పడుకోబెట్టి, శంకరమ్మ మరొక గదిలో పడుకుంది. నిరంతరం కురుస్తున్న వర్షాలకు నానిన గోడలు, పైకప్పు, ఇంటి దూలం విరిగి ఒక్కసారిగా గాఢ నిద్రలో ఉన్న శంకరమ్మపై పడ్డాయి . నిద్రలో ఉన్న ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త మరో రూమ్ లో పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఉదయాన్నే చుట్టుపక్కల వారు ఇంటి పైకప్పు కూలిపోవడం గమనించి, శిధిలాల కింద ఉన్న శంకరమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం ఘటన స్థలాన్ని మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహశీల్ధార్ తులసీరామ్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శంకరమ్మ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా సహాయం అందేలా కృషి చేస్తామని ఆమె తెలిపారు. పురాతన ఇళ్లలో ఎవరు ఉండకూడదని ఆర్డీఓ సూచించారు. అవసరమైతే అధికారుల సహాయం తీసుకోవాలన్నారు.
మంత్రి ఆర్థిక సహాయం
ఇంటి పైకప్పు కూలి వృద్దురాలు శంకరమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా స్పందించారు. బాధిత కుటుంబానికి తక్షణంగా రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతేకాకుండా ఆమె అంత్యక్రియలకు రూ. 11 వేలు ఆదివారం కుటుంబానికి స్థానిక నాయకులు అందజేశారు. కుటుంబాన్ని అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
కూలిపోయిన ఇండ్లకు పరిహారం
మెదక్ జిల్లా హవెలి ఘన్పూర్ మండలంలో అధికారులతో కలిసి ఆదివారం మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. అధిక వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 25 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, 01 పూర్తిస్థాయిలో నష్టం వాటిలిందని తెలిపారు. కూలిపోయిన ఇండ్లకు ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారాన్ని అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కూలిపోయే దశలో ఉన్న ఇండ్లలో నివసించే వారికని వెంటనే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ భవనాలలో పునరావాసం కల్పించాలన్నారు. జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరద నష్టాన్ని యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని ఆయన వివరించారు.
సంబంధిత కథనం