Maoist Party: మావోయిస్టు పార్టీకి మరో షాక్… అగ్రనేత భార్య లొంగుబాటు
maoist key leader savitri: మావోయిస్టు పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల ఏవోబీలో 700 మంది సానభూతిపరులు లొంగిపోగా.. తాజాగా తెలంగాణలో మావోయిస్టు అగ్రనేత భార్య లొంగిపోయారు.
maoist key leader savitri surrender: మావోయిస్టు పార్టీకి పూర్తి గడ్డుకాలంలా కనిపిస్తుంది. తెలంగాణలో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్న మావోయిస్టు మూలాలను తుడిచిపెట్టేందుకు పోలీసులు పక్కగా పావులు కదుపుతున్నారు. ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా పనిచేసిన రామన్న భార్య రావుల సావిత్రి (46) పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె మీడియా ఎదుటకు వచ్చారు.
మావోయిస్టు కీలక నేత రామన్న 2019లో అనారోగ్యంతో మరణించారు. 1993లో సావిత్రి ఛత్తీస్‌గఢ్ కుంట దళంలో చేరినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో మావోయిస్టు నాయకుడిగా పనిచేస్తున్న రామన్నను ఆమె వివాహం చేసుకుందని డీజీపీ తెలిపారు. ప్రస్తుతం కిష్టారం ఏరియా కమిటీకి కార్యదర్శిగా సావిత్రి పనిచేస్తున్నట్టు వివరించారు. సావిత్రి కుమారుడు రావుల శ్రీకాంత్ అలియాస్ రంజిత్ కూడా గతేడాది పోలీసుల ఎదుట లొంగిపోయారని వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయినందుకు తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును సావిత్రికి అందించారు. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రామన్న మోస్ట్ వాంటెడ్‌గా ఉండగా.. రామన్నపై అప్పట్లో పోలీసులు రూ.40లక్షల రివార్డు ప్రకటించారు
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. ఈ పరిణామం మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీరిలో 300 మంది మిలీషియా సభ్యులు కూడా ఉండటం గమనార్హం. లొంగిపోయిన తర్వాత మావోయిస్టులు ఇచ్చిన దుస్తులను తగులబెట్టి మావోయిస్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక మావోయిస్టు పార్టీని మళ్లీ తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్న సమయంలో సావిత్రి వంటి నేతలు లొంగిపోవడం పెద్ద దెబ్బనే చెప్పొచ్చు.
ఇటీవల కాలంలో మహారాష్ట్ర సరిహద్దుల నుంచి తెలంగాణ ప్రాంతంలోకి ప్రమాదకరమైన రెండు దళాలు ప్రవేశించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. మోస్ట్ వాంటెండ్ అడెల్లు దళంతో పాటు మరో దళం సభ్యులు ఆదిలాబాద్ అడవుల్లో ప్రవేశించాయన్న సమాచారంతో పోలీసులు విస్తృత తనిఖీలు కూడా నిర్వహించారు. అయితే, అడుగడుగునా మావోయిస్టు పార్టీని పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. భారీ స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరగనుందన్న సమాచారంతో సానుభూతిపరులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు.