Vande Bharat Manufacturing : తెలంగాణలోనే వందేభారత్ తయారీ.. ఎక్కడో తెలుసా?
Vande Bharat Manufacturing : వరంగల్ ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. 45 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కాజీపేటలో కోచ్‌లు తయారు చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడంతో ఆశలు చిగురిస్తున్నాయి.
కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని అయోధ్యపురం వద్ద వ్యాగన్ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని అప్‌గ్రేడ్ చేసి కోచ్‌లు తయారు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉన్న వందేభారత్ రైలు కోచ్‌లను కాజీపేటలో తయారు చేయాలని నిర్ణయించారు.
కాజీపేట జంక్షన్ సమీపంలోని మడికొండలోని మెట్టుగుట్ట సీతారామాంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన.. 240 ఎకరాల దేవాదాయశాఖ భూములు ఉన్నాయి. ఇందులో 160 ఎకరాలు రైల్వే శాఖకు ఇచ్చారు. మిగిలిన స్థలాన్ని కూడా కోచ్‌ల నిర్మాణానికి కేంద్రం సేకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
1980 దశకంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. అప్పట్లో డీజిల్ షెడ్ పక్కనున్న స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అయితే.. పంజాబ్ అల్లర్ల నేపథ్యంలో అక్కడ పరిశ్రమలు నెలకొల్పి.. యువతను ఆకట్టుకోవాలనే ఆలోచనతో కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని కపుర్తాలకు తరలించారు.
అప్పటి నుంచి కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. 2010లో వ్యాగన్ మరమ్మతుల వర్క్‌షాపు, వ్యాగన్ తయారీ కేంద్రాన్ని సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ స్థలం లేకపోవడంతో కాజీపేటకు తరలించారు. ఇక్కడా స్థల సేకరణలో ఆలస్యమైంది. 2016లో వ్యాగన్ షెడ్ కోసం నిధులు కేటాయించారు.
2023లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాగన్ రిపేర్ వర్క్‌షాపు పనులను ప్రారంభించారు. అయితే.. ఓరుగల్లు ప్రజలు దీనిపై అసంతృప్తిగా ఉండటంతో.. వ్యాగన్ రిపేర్ వర్క్‌షాపుతో పాటు పిరియాడికల్ ఓవరాహాలింగ్ కేంద్రాన్ని కూడా మంజూరు చేశారు. తాజాగా.. వందేభారత్ రైలు కోచ్‌లకు డిమాండ్ ఉండటంతో.. వ్యాగన్ తయారీ పరిశ్రమను, పీఓహెచ్‌ను కోచ్ ఫ్యాక్టరీగా అభివృద్ధి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కోచ్ ఫ్యాక్టరీకి 3 వేల మంది సిబ్బంది అదనంగా రానున్నారు. పీఓహెచ్, వ్యాగన్ పరిశ్రమలకు 2 వేల మంది అవసరం అవుతారు. రెండు పరిశ్రమలకు కలిపి మొత్తం 5 వేల మంది కార్మికులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముందుగా వందేభారత్ రైళ్ల కోచ్‌ల తయారీపైనే దృష్టి పెడుతున్నారు. షెడ్ నిర్మాణం కాగానే తయారీ యంత్రాలను అమరుస్తారు. పెరంబూరు కోచ్ ఫ్యాక్టరీలో పనిచేసే నిపుణులను రప్పించి ఇక్కడి కార్మికులు, అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.