Telangana Rains : నీటితో నిండిన కాజీపేట రైల్వే స్టేషన్ - పలు రైళ్లు రద్దు
Rains in Warangal : వరంగల్ నగరలో వానలు దంచికొడుతున్నాయి. ఫలితంగా కాజీపేట్ రైల్వే స్టేషన్(జంక్షన్)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Rains in Telangana: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక వరంగల్ నగరంలో చెప్పే పరిస్థితి లేదు. చాలా కాలనీలు నీట మునిగిపోయాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక నగరంలో ఉన్న కాజీపేట రైల్వే స్టేషన్ లోనూ అదే పరిస్థితి ఉంది. వరద నీరు స్టేషన్ లోకి వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల పట్టాలపై నీరు చేరడంతో ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా హసన్‌పర్తి-ఖాజీపేట రూట్‌లో రెండు రైళ్లను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
హసన్‌పర్తి - కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు చేరింది. ఫలితంగా రెండు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 9 రైళ్లను దారి మళ్లించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ (17233), సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేశారు. తిరుపతి - కరీంనగర్ (12761), కరీంనగర్ - తిరుపతి (12762), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ (12757), సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
సికింద్రాబాద్ - ధన్ పూర్, తిరువనంతపురం - న్యూ ఢిల్లీ, బెంగళూరు - ధన్ పూర్, చెన్నై - అహ్మాదాబాద్ రైళ్లను కూడా దారి మళ్లించారు. యశ్వంతపూర్ - హజరాత్ నిజాముద్దీన్, యశ్వంతపుర్ - గోరఖ్ పూర్, సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ రైళ్లను కూడా దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
వరంగల్ నగరంలో దాదాపు 70 కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు, గుడిసెల్లోకి వరద నీరు చేరి నిత్యాసవరాలు, సామగ్రి తడిసిపోయాయి. వందలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అతిభారీ వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్ సంతోషి మాత టెంపుల్ దగ్గర భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గంట గంటకు ఉద్ధృతి పెరుగుతోంది.
భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరద పోటెత్తింది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమైంది. పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తోంది. నగరంలో ఉన్న ఎస్ఆర్ వర్శిటీ వద్ద భారీగా వరద నీరు చేరింది. ములుగు రోడ్డు జంక్షన్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాళ్ల పద్మావతి కాలేజీ వద్ద ఉన్న మిషన్ భగీరథ పంప్ సెట్ లోకి కూడా వరద నీరు చేరింది. భవానీ నగర్, నయిమ్ నగర్, శివనగర్, ఎల్బీ నగర్, కొత్తవాడ, కరీంబాద్ తో పాటు చాలా కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి.
సంబంధిత కథనం