మంచిర్యాల జిల్లాలో బీజేపీకి షాక్.. మందమర్రి టౌన్ ప్రెసిడెంట్ రాజీనామా-mandamarri bjp town president resigned ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మంచిర్యాల జిల్లాలో బీజేపీకి షాక్.. మందమర్రి టౌన్ ప్రెసిడెంట్ రాజీనామా

మంచిర్యాల జిల్లాలో బీజేపీకి షాక్.. మందమర్రి టౌన్ ప్రెసిడెంట్ రాజీనామా

HT Telugu Desk HT Telugu
Feb 21, 2022 02:03 PM IST

మంచిర్యాల జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నాయకులు, ప్రస్తుత మందమర్రి పట్టణ బీజేపీ అధ్యక్షుడు మద్ది శంకర్, పట్టణ విభాగం నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ నుంచి ఇటీవల నిజామాబాద్ జిల్లాలో, తాజాగా మంచిర్యాల జిల్లాలో నేతలు వీడడం సరికొత్త పరిణామం
తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ నుంచి ఇటీవల నిజామాబాద్ జిల్లాలో, తాజాగా మంచిర్యాల జిల్లాలో నేతలు వీడడం సరికొత్త పరిణామం (PTI)

భారతీయ జనతా పార్టీ తెలంగాణా సమాజం పట్ల చిన్న చూపు, వివక్ష చూపుతున్నందున విసిగిపోయానని, తెలంగాణా ఆత్మగౌరవానికి బీజేపీలో విలువ లేదని తెలుసుకున్నానని ఆ పార్టీ మందమర్రి పట్టణ అధ్యక్షుడు మద్ది శంకర్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

‘పార్లమెంటులో ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని గేలి చేస్తూ తల్లిని చంపి బిడ్డను బతికించారని అన్నారు.ఈ మాటను బట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల అతనికి సదభిప్రాయం లేదని అర్థమయింది. గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు బొగ్గు గనుల వేలం పాటలు ఉపసంహరించుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ విన్నవించినప్పటికీ, కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణ్ పల్లి, కె.కె.6 గనులను సింగరేణికి అప్పగించకుండా వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ వాడిగా నేను కూడా జీర్ణించుకోలేకపోయాను. సింగరేణి కార్మికులు ఈ బొగ్గు గనుల వేలం పాటలను రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని మూడు రోజులు సమ్మె చేసినా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అహంకార ధోరణితో వ్యవహరించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా వేధిస్తుండటం కూడా నన్ను కలచివేసింది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలన చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీలో మనసు చంపుకొని ప్రజావ్యతిరేకిగా ఉండలేను. తెలంగాణ ఉద్యమమంలో పాల్గొని ఆమరణ దీక్ష కూడా చేసిన నేను తెలంగాణ సమాజ పతనం ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నాను..’ అని తన రాజీనామా లేఖలో మద్ది శంకర్ తెలిపారు.

తనతో పాటుగా బీజేపీ మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులు అందుగుల లక్ష్మణ్, బియ్యాల సమ్మయ్య , పట్టణ ప్రధాన కార్యదర్శి సెపూరి లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి దోనుగు రమేష్, పట్టణ పార్టీ కోశాధికారి మురళి, యువ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు రంగు రమేష్, బీసీ మోర్చా మందమర్రి పట్టణ అధ్యక్షుడు పూసాల ఓదెలు, బూత్ అధ్యక్షులు బండి రవి, చెల్లేటి తిరుపతయ్యలు కూడా రాజీనామా చేస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆయన త్వరలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.

టీ20 వరల్డ్ కప్ 2024