Telangana Police : పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి బర్త్‌డే వేడుకలు.. ఎస్సైపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు!-mandal congress president ramesh joshi birthday celebration at vatpally police station ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Police : పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి బర్త్‌డే వేడుకలు.. ఎస్సైపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు!

Telangana Police : పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి బర్త్‌డే వేడుకలు.. ఎస్సైపై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు!

Basani Shiva Kumar HT Telugu
Sep 09, 2024 02:11 PM IST

Telangana Police : తెలంగాణలోని పలు చోట్ల పోలీసులు తీరు విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల వరంగల్‌లో మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో ఏసీపీ కేక్ కట్ చేయగా.. తాజాగా ఓ కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలను వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లోనే నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఎస్సైపై బదిలీ వేటు పడింది.

పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలు
పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలు

తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల తీరుపై తరుచూ విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలకు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు కొందరు పోలీస్ అధికారులు. తాజాగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి పుట్టిన రోజు వేడుకలను పోలీస్ స్టేషన్‌లో నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.

ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే..

ఆందోల్ నియోజకవర్గం వట్‌పల్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వట్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రమేష్ జోషి పుట్టిన రోజు వేడుకలను ఠాణాలోనే నిర్వహించారు. వట్‌పల్లి ఎస్సై లక్ష్మణ్, కానిస్టేబుల్స్ అందరూ కేక్ కట్ చేసి.. రమేష్ జోషికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు.

ఐజీ సీరియస్..

పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై.. హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ సీరియస్ అయ్యారు. వట్‌పల్లి ఎస్సై లక్ష్మణ్‌పై బదిలీ వేటు వేశారు. వట్‌పల్లి ఎస్సైని విఆర్‌కు పంపించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్ర పై విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో సిబ్బందిలో భయం మొదలైంది. ఈ ఇష్యూ ఇప్పుడు ఆందోల్ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

కేక్ కట్ చేసిన ఏసీపీ..

ఇటీవల మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్.. కాంగ్రెస్ లీడర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఆయనతో పాటు సీఐ, సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వేడుకల్లో పాల్గొనవచ్చా అని సోషల్ మీడియా వేదికగా డీజీపీని ప్రశ్నిస్తున్నారు.

అత్యుత్సాహం..

మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు సందర్భంగా.. వరంగల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనాల మధ్యే రోడ్డుపై పటాకులు పేల్చారు. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. హరిణి అనే యువతి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. పబ్లిక్ ప్లేసులో ఇలాంటి పనులేంటని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.

Whats_app_banner