TS Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడూ.. భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు..!
TS Nominated Posts: ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలు రగిలిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా.. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను భర్తీ చేయకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 11 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ జిల్లాలోని నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక జరిగిన తొలి, మలి ఎన్నికల్లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధికారానికి దూరమైనా.. పదేళ్లు పార్టీని కాపాడామని, కష్టాలు నష్టాలు ఎదుర్కొని నిలబడ్డామని కార్యకర్తలు చెబుతున్నారు. ఇపుడు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి కావొస్తున్నా.. పదవీ యోగానికి నోచుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను నమ్ముకుని పనిచేసిన సీనియర్లు కూడా.. అటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఇటు జిల్లా స్థాయి పదవులను ఆశిస్తూ ఎదురు చూస్తున్నారు.
సీఎం అనుచరులకే పదవులా..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా పాత్ర కీలకమైనది. ఆ కారణంగానే జిల్లాకు చెందిన సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసిన కార్పొరేషన్లలో బండ్రు శోభారాణి (రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార కార్పొరేషన్), పటేల్ రమేష్ రెడ్డి (టూరిజమ్ కార్పొరేషన్) పదవులు మాత్రమే ఇప్పటి వరకు దక్కాయి. అయితే.. ఈ ఇద్దరు నాయకులు తొలి నుంచీ కాంగ్రెస్‌లో ఉన్నవారు కారు.
రేవంత్ రెడ్డితో..
రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలో.. పటేల్ రమేష్ రెడ్డి ఆయన వెంటే వచ్చి కాంగ్రెస్ లో చేరారు. బండ్రు శోభారాణి సైతం రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన నేత. దీంతో బయటి నుంచి వచ్చిన నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వలేదన్న ఆగ్రహం కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఉంది. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డి.. సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆశించారు. కానీ, ఆ ఎన్నికల్లో పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.దామోదర్ రెడ్డికి టికెట్ దక్కింది.
ఎంపీ టికెట్ ఇస్తామని..
రమేష్ రెడ్డిని పోటీ నుంచి పక్కకు తప్పించేందుకు పార్టీ నాయకత్వం ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇచ్చింది. కానీ, ప్రభుత్వం ఏర్పాటు కాగానే, పటేల్ రమేష్ రెడ్డికి రాష్ట్ర టూరిజమ్ కార్పోరేషన్ చైర్మన్‌గా నియమించారు. రాష్ట్ర స్థాయి పదవుల దక్కిన ఇద్దరూ సీఎం రేవంత్ రెడ్డి అనుచర నేతలు కావడం గమనార్హం. గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డెయిరీ డెవలప్ మెంట్ కార్పేరేషన్ పదవి దక్కడంతో.. సీనియర్లంతా మంత్రుల వద్ద పేచీ పెట్టారు. దీంతో ఆయన నియామకానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.
జిల్లా నేతలకు పదవులు ఎప్పుడు..?
జిల్లా కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న జానారెడ్డి, మంత్రులు వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ రాష్ట్ర స్థాయి పదవులను ఆశిస్తున్న వారే ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న శంకర్ నాయక్ జానారెడ్డి ప్రధాన అనుచర నేతల్లో ఒకరు. నిడమనూరు మాజీ జడ్పీటీసీ సభ్యుడు, నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కొండేటి మల్లయ్య సైతం రేసులో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి తీసుకున్న వేముల వీరేశానికి టికెట్ ఇవ్వడంతో.. మల్లయ్యకు మొండిచేయి చూపారు. నామినేట్ పదవితో న్యాయం చేస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉన్న మాజీ జడ్పీటీసీ సభ్యుడు గుమ్మల మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని ఆశిస్తున్నారు. వీరే కాకుండా నియోజకవర్గాల వారీగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, వాటిలో డైరెక్టర్ పోస్టులతో పాటు, జిల్లా స్థాయిలో కార్పొరేషన్ పదవులు, దేవాలయాల చైర్మన్ పదవులు, వ్వవసాయ మార్కెట్ పాలకవర్గాల్లో పదవులు ఆశిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పరిగణలోకి తీసుకుని.. పదవులు భర్తీని పూర్తి చేయాలని నేతలు యోచిస్తున్నారు. అపుడే స్థానిక ఎన్నికల్లో ఆ నాయకులు బాధ్యత తీసుకుని పనిచేస్తారనే టాక్ ఉంది.
( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )